Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ చీఫ్ కవిత మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. ఎంతసేపు వాళ్లని వీళ్లని తిట్టడమేనా? మరి పాలనపై ఎప్పుడు దృష్టి పెడతారు అని నిలదీశారు. ఇకనైనా తిట్టుడు బంద్ చేసి కట్టుడు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ కి సలహా ఇచ్చారు కవిత. వెంటనే మిషన్ భగీరథను వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. అది 100 శాతం పూర్తి కాకపోతే మీరు పూర్తి చేయండి అని వ్యాఖ్యానించారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వడం ప్రాథమిక హక్కు అని కవిత తేల్చి చెప్పారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ఒక్క రిజర్వాయర్ కట్టలేదని రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
మేడిగడ్డ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు
మరోవైపు మేడిగడ్డ అంశంపైనా కవిత స్పందించారు. మేడిగడ్డ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు గోదావరి నీళ్లు వినియోగంలోకి తెస్తారని రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు. ''మేడిగడ్డను కూలగొట్టి మళ్లీ కట్టాలని రిపోర్టు వచ్చిందని చెబుతున్నారు. 8 నుంచి 10 నెలల వరకు వానలు లేవు ఎండలే ఉంటాయని అంటున్నారు.
మేడిగడ్డను కూలగొట్టి మళ్లీ కడతారా?
మరి ఈ 8 నుంచి 10 నెలల్లో మేడిగడ్డను కూలగొట్టి మళ్లీ కడతారా? లేక.. పోయిన ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ టైమ్ పాస్ చేస్తారా? గోదావరి జలాలు వినియోగంలోకి తేకుండా చేస్తారా? దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రజలకు స్పష్టత ఇవ్వాలి'' అని కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ తిట్టుడు బంద్ చేసి కట్టుడు మొదలు పెడితే బాగుంటుందన్న కవిత.. మేడిగడ్డ పూర్తైతే భవిష్యత్తులో ప్రజలకు పనికొచ్చే పరిస్థితి ఉంటుందన్నారు.
హైదరాబాద్ లో 8వేల చెరువులు మాయం
''పట్టణాలు, హైదరాబాద్ లో తాగునీటికి కూడా ఇబ్బంది వస్తుందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అది కేవలం ఎల్ నినో తప్పు కాదు.. ముఖ్యమంత్రి అనుచరుల భూకబ్జాల తప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ లో 8వేల చెరువులు మాయమైపోయాయి అని కాగ్ రిపోర్టులో వచ్చింది. ఆ చెరువులు ఏమైనట్లు? హైడ్రా ఏం చేస్తున్నట్లు? చెరువులు మాయమైతే భూగర్భ జలాలు ఇంకిపోతాయి. బోరు మీద ఆధారపడ్డ వారికి తాగునీరు దొరకదు. దాని మీద తక్షణమే సీఎం రేవంత్ రిపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా నీళ్లు ఏపీకి రాసిచ్చిందని రేవంత్ అబద్దాలు చెప్పారు. కేవలం ఏడాది కోసం మాత్రమే అప్పటి ప్రభుత్వం సంతకం పెట్టింది. మీరు అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఒక్క చుక్క కృష్ణా నీళ్లను కూడా మీ మహబూబ్ నరగ్ కు తీసుకురాలేకపోయారు'' అని కవిత ధ్వజమెత్తారు.
అన్ని అంశాల్లో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం
''అన్ని అంశాల్లో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారు. రైతులను, రైతు కూలీలను, ప్రజలను ఆదుకోవడంలో.. కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో విఫలం చెందారు. పక్క రాష్ట్రాల్లో ఇంత సంక్షోభం లేదు. వాళ్లు రెండు మూడు నెలల ముందే చర్యలు చేపట్టారు. కరువు తీవ్రత గురించి 10 నెలల ముందే తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే రాష్ట్రం ఈరోజు విద్యుత్ కొరత, నీటి కొరతతో సతమతమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలపై దూరదృష్టితో వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి.. ఆ బాధ్యత విస్మరించి తన పరివారానికి ఆస్తులు, భూములు కూడబెట్టడంలో బిజీగా ఉన్నారు.
నవంబర్ చివరి వరకు డెడ్ లైన్
మీరు అడుక్కుని వస్తారో, కొనుక్కుని వస్తారో మాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ చివరి నాటి వరకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామన్న 12వేలు కచ్చితంగా ఇవ్వాలి. రైతు కూలీలకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాలి. గురుకులాల్లో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో, ఎన్ఆర్ ఈజీఎస్ కూలీలు పనిచేసే దగ్గర ఓఆర్ఎస్ కచ్చితంగా అందుబాటులో ఉండేలా చూడాలి'' అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కవిత.
ఇవ్వగలిగే అవకాశం ఉన్నా రేవంత్ సర్కార్ నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదనే విషయాన్ని రైతులు, ప్రజలు గనమించాలని కవిత కోరారు. ఈ కష్టకాలంలో టీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన ఉంటుందని, అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు కోసం అవసరమైతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కలిసి విజ్ఞప్తి చేస్తామని కవిత అన్నారు.
విద్యుత్ కేంద్రాల ప్రైవేటీకరణకు కుట్ర
ఓవైపు విద్యుత్ మీద ప్రభుత్వ కంట్రోల్ ఉండాలని చెబుతున్న ముఖ్యమంత్రి.. మరోవైపు విద్యుత్ కేంద్రాలను ప్రైవేటుకు ధారాదత్తం చేసే కుట్రకు పాల్పడుతున్నారని కవిత ఆరోపించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని వివిధ విభాగాలను ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు కట్టబెట్టారో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికే కరెంట్ లేక రైతులు ఆగమవుతుంటే ఉన్న విద్యుత్ కేంద్రాలను ప్రైవేటీకరించడం వెనకున్న మర్మం ఏమిటి? అని నిలదీశారు. మీ స్వార్థపూరిత చర్యల వల్ల విద్యుత్ యూనిట్ ధర పెంపుతో పాటు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని.. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కవిత డిమాండ్ చేశారు.


