KTR: సింగరేణి బొగ్గు విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సింగరేణి బొగ్గుకు సంబంధించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సింగరేణిలో కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గును కాదని విదేశీ బొగ్గు దిగుమతులు అంటూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ బొగ్గు కొనుగోళ్లపై విచారణకు సిద్ధమా? అని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు కేటీఆర్. కమీషన్ల కోసమే విదేశీ బొగ్గు కొనుగోలు ప్లాన్ అని మండిపడ్డారు.
సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్
సింగరేణిలో రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో సోలార్ పవర్ కుంభకోణాన్ని బయటపెడతానని తెలిపారు. సింగరేణిలో టన్ను బొగ్గు రూ.3వేల 800కే లభిస్తోందని.. అలాంటప్పుడు విదేశీ బొగ్గు కోసం రూ.10వేల నుంచి రూ.12వేలు ఎందుకు? అని రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు. కమీషన్ల కోసమే సీఎం రేవంత్ విదేశీ బొగ్గు కొనుగోళ్లుకు ప్రాధాన్యం ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
అప్పుడు యూనిట్ విద్యుత్ రూ.3.90కే కొన్నాం
బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ సరిగా రావడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో యూనిట్ విద్యుత్ ను రూ.3.90కే కొన్నామన్న కేటీఆర్.. ఇప్పుడు యూనిట్ విద్యుత్ రూ.15కి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ధ్వజమెత్తారు. కాళేశ్వరం నుంచి నీళ్లు విడుదల చేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలు, రైతులను ఆదుకోవాలని రేవంత్ సర్కార్ కు సూచించారు కేటీఆర్.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
''సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడింది. విదేశీ బొగ్గు కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. రేవంత్ రెడ్డి బావమరింది కొల్లగొట్టిన నిధులపై విచారణ జరపాలి. సింగరేణిలో జరిగిన సౌర విద్యుత్ స్కామ్ త్వరలో బయటపెడతా. సింగరేణిని కాదని విదేశీ బొగ్గు తెచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. కమీషన్లు వస్తాయనే ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొనుగోళ్లకు యత్నం. రేవంత్ రెడ్డి ఈఎంఐ సీఎం.. అది కట్టకుంటే ఆయన పదవి పోతుంది. కొందామంటే కరెంట్ లేదని రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారు. కరెంట్ ను మేము రూ.3.90కే కొంటే కుంభకోణం అన్నారు. ఇప్పుడు కరెంట్ ను రూ.15 పెట్టి కొనాలని చూస్తున్న మీరు చేసిందేమిటి?
ఆంధ్రాలో జల పండగ.. తెలంగాణలో కరువు
కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయాలని ఆర్నెళ్ల ముందే విజ్ఞప్తి చేశాం. ఉన్న నీళ్లు కిందికి పోయాయి.. పంటలు ఎండిపోతున్నాయి. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరుకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. ఆంధ్రాలో జల పండగ ఉంటే ఇక్కడ కరువు ఎందుకు ఉంటుంది? రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలు, రైతులను ఆదుకోవాలి'' అని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్.


