తెలంగాణ

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ - బీజేపీ తెరవెనుక డీల్?

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

MLC Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఫుల్ స్పీడ్‌తో ప్రచారంలో దూసుకుపోతుంటే.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రం ఇంకా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేక తర్జనభర్జన పడుతున్నాయి.

MLC Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఫుల్ స్పీడ్‌తో ప్రచారంలో దూసుకుపోతుంటే.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రం ఇంకా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేక తర్జనభర్జన పడుతున్నాయి. అయితే ఈ తాత్సారం వెనుక ఒక సంచలన రాజకీయ వ్యూహం దాగి ఉందన్న చర్చ ఇప్పుడు గాంధీభవన్, తెలంగాణ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు "నువ్వు అక్కడ.. నేను ఇక్కడ" అంటూ ఇరు పార్టీలు లోపాయికారీ ఒప్పందానికి సిద్ధమవుతున్నాయా? అన్న గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్‌లో గుప్పుమంటున్నాయి.

రెండు స్థానాలు.. మూడు పార్టీలు..

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తున్న వేళ.. బీజేపీ ఒక్కో స్థానానికి ముగ్గురేసి పేర్లతో లిస్ట్ సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపే పనిలో పడింది. అటు బీఆర్‌ఎస్ ఓటర్ల నమోదు, నేతల సమన్వయంతో ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ చేస్తోంది. కానీ క్షేత్రస్థాయి సమీకరణాలు చూస్తే.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో బీజేపీ బలంగా కనిపిస్తుండగా, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలో మాత్రం ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదనే చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇక్కడే రెండు పార్టీల మధ్య పరస్పర సహకారం గురించిన సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.

నల్గొండలో బీఆర్‌ఎస్‌కు మద్దతు.. హైదరాబాద్‌లో బీజేపీకి సహకారం?

వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థే ఈసారి కూడా గులాబీ పార్టీ తరఫున మళ్లీ బరిలోకి దిగుతారని గట్టిగా ప్రచారం సాగుతోంది. గతంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఆ నేతకు గత ఎన్నికల్లోనే బీజేపీ కేడర్ అంతర్గతంగా మద్దతిచ్చిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఆ స్థానంలో అభ్యర్థిని తేల్చకుండా బీజేపీ తాత్సారం చేయడం వెనుక.. పరోక్షంగా బీఆర్‌ఎస్‌కే లైన్ క్లియర్ చేసే ఆలోచన ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి ప్రతిగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాన్ని బీజేపీకి వదిలేసేలా బీఆర్‌ఎస్ పావులు కదుపుతోందని సమాచారం. ఈ స్థానం నుంచి బీజేపీ ముఖ్య నేత రామచంద్రరావు బరిలోకి దిగే అవకాశాలు బలంగా కనిపిస్తుండగా, ఆయనకు సహకరించేలా బీఆర్‌ఎస్ బలహీనమైన అభ్యర్థిని పోటీకి దించుతుందా? లేదా పోటీకే దూరంగా ఉంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్కడ మనకు బీజేపీ సాయం చేయాలంటే, ఇక్కడ మనం వారికి సహకరించాల్సిందేనంటూ బీఆర్‌ఎస్ అంతర్గత సమావేశాల్లో నేతలకు సూచించినట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

దసరా తర్వాత క్లారిటీ..

రెండు చోట్లా కాంగ్రెస్‌తో పోరాడి రెండింటినీ కోల్పోయే కంటే.. పరస్పర అవగాహనతో ఒక్కో స్థానంపై దృష్టి పెట్టి కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టాలన్నది ఈ రెండు పార్టీల వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దసరా తర్వాత నల్గొండ స్థానంలో ఓసీ అభ్యర్థిని, హైదరాబాద్ స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో కూడా బీఆర్‌ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి బయటకు ఉప్పు-నిప్పులా కనిపించే ఈ రెండు పార్టీలు.. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ లోపాయికారీగా నిజంగానే చేతులు కలుపుతాయా? లేక ఎవరికి వారే సత్తా చాటుకుంటారా? అనేది త్వరలోనే తేలనుంది.

#Telangana MLC Elections#MLC Elections#Graduate MLC Elections#Telangana Politics#BRS#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి