రాష్ట్రంలో కమీషన్ల అంశం రాజకీయ హీట్‌ను రగిలించింది. సొంత పార్టీ నుంచే ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రేడియల్ రింగు రోడ్డు ప్రాజెక్టులో కమీషన్ల కోసమే తన కంపెనీకి టెండర్ దక్కకుండా చేసి ఆంధ్రావాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణ కంపెనీలకు పనులు దక్కకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ లాబీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను నిర్ణయిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.తన కంపెనీ నుంచి టెండర్ వేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రుద్ర ఉదయ్ సింహా కాల్ చేసి చెప్పారని పేర్కొన్నారు.
2015 ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితో పాటు రుద్ర ఉదయ్ సింహ కూడా నిందితుడిగా ఉన్నాడని తెలిపారు.అయితే, తన కొడుకు కంపెనీ సుశీ ఇన్ఫ్రా.. అతను బిడ్డింగ్‌లో పాల్గొంటాడని రుద్ర ఉదయ్ సింహకు చెప్పానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు.రేడియల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
రేడియల్ రింగ్ రోడ్ కాంట్రాక్టులను 15 శాతం కమీషన్ ఆధారంగా కేటాయించారని తెలంగాణ కాంట్రాక్టర్ ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ ఎండీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు. ఈ టెండర్లలో అవినీతి జరిగిందని, తమ కంపెనీకి అన్యాయం జరిగిందన్నారు.అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
రూ.600 కోట్ల రేడియల్ రోడ్ల స్కాం మీద కీలకవ్యాఖ్యలు చేశారు.తమ సుశీ సంస్థ రూ.600 కోట్లకు తక్కువ బిడ్ వేసినా ఆంధ్రా సంస్థలకే టెండర్లు ఇచ్చారన్నారు. నాగార్జున కన్స్ట్రక్షన్స్, బీవీఎస్ఆర్, జీకేసీ అనే 3 ఆంధ్రా కంపెనీలకే టెండర్లు ఇచ్చారని, తమ సంస్థకు టెండర్ ఇచ్చుంటే ప్రభుత్వానికి రూ.600 కోట్లు ప్రజాధనం మిగిలేది అని అన్నారు.
తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకునేందుకు కమీషన్ల కోసమే తమకు టెండర్ ఇవ్వలేదని ఆరోపించారు. ఒక సంతకం లేదని తమ టెండర్ రిజెక్ట్ చేశారని, ఆ సంతకాన్ని తెచ్చిచ్చినా రిజెక్ట్ చేశారన్నారు. అందుకే కోర్టులో పిటిషన్ వేశానన్నారు.ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీని నియమించారని, సింగరేణిలో మూడేళ్లుగా అవినీతి జరుగుతోందన్నారు.ఆ సంస్థ మూతపడే దుస్థితికి వచ్చిందన్నారు. రేడియల్ రోడ్డు స్కాంపై వెనక్కి తగ్గనన్నారు.


