దేశంలో బంగ్లాదేశ్ తరహాలో దాడులు, విప్లవాల ద్వారా 'పాలన మార్పు' (Regime Change) తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నామనే ముసుగులో దేశంలో అరాచకం, రాజకీయ అస్థిరత వాతావరణాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాజ్నాథ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం (ECI), ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR), ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్లను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం అడ్డదారిలో అధికారం చేజిక్కించుకోవడానికేనని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. యువతలో ఉన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు, ఎన్నికల ప్రక్రియలపై నిరంతరం నిందలు వేస్తూ ప్రజల్లో అయోమయాన్ని సృష్టించడం బాధ్యతారాహిత్యమని ఆయన హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగ వ్యవస్థల ఉల్లంఘనలను ప్రస్తావిస్తూ రాజ్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. 1975 నాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ, 1984 సిక్కుల వ్యతిరేక హింస, 1990 కరసేవకుల కాల్పుల ఘటనలను గుర్తుచేశారు.
‘1975లో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని జైలులో పెట్టగా, నేడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతూ అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారు’ అని విమర్శించారు. గతంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ హయాంలో జరిగిన పరిణామాలను ఉటంకిస్తూ, కాంగ్రెస్ పార్టీ తమ అనుకూల అధికారులను రక్షించి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు.


