ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పలుమార్లు ఆందోళలనకు పిలుపునిచ్చింది.ప్రస్తుతం జంతర్ మంతర్‌లో నిరసనలకు అనుమతి బ్యాన్ చేయడంతో కనాట్ ప్రదేశంలో తిరంగా ర్యాలీకి సేజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కనాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్‌లను మూసివేసింది.
ఈ విషయం సుప్రీం మెట్లు ఎక్కగా.. స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. వ్యాపారులకు నష్టం వాటిల్లినట్లు తెలిస్తే రాజ్యాంగ పరిహార అధికారాలను ఉపయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. కనాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్‌ల మూసివేతపై ఢిల్లీ కిరాణా కమిటీ, ఢిల్లీ ఐరన్ అండ్ హార్డ్‌వేర్ మర్చంట్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్ జై అనంత్ దేహద్రాయ్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దసరా పండుగ సమీపిస్తున్న వేళ సెంట్రల్ పార్క్‌లో నిరసనలు, ఎన్డీఎంసీ విధించిన ఆంక్షల వల్ల రోజుకు దాదాపు రూ.200 కోట్ల మేర వ్యాపార లావాదేవీలకు నష్టం కలుగుతుందని వాదినలు వినిపించారు. వ్యాపారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సీజేఐ మాట్లాడుతూ.. పండుగ రోజుల్లో చిన్న షాపుల యజమానులు తమ జీవనోపాధిని పొందుతారని తెలుసు.
ఇలాంటి టైంలో వ్యాపారాలకు అంతరాయం కలిగితే ఆ కుటుంబాలు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. దీనిపై జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ కూడా స్పందిస్తూ.. ఒకవేళ ఎన్డీఎంసీ విధించిన ఆంక్షలు దామాషాకు మించి ఉన్నాయని, వ్యాపారులకు అక్రమంగా నష్టం కలిగిందని కోర్టు భావిస్తే రాజ్యాంగ పరిహార నియమాల ప్రకారం నష్టపరిహారం ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 26కు న్యాయస్థానం వాయిదా వేసింది.


