పోలీసు ఉద్యోగులు యూనిఫామ్స్ ధరించిన సమయంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అని వారికి తాజాగా మార్గదర్శకాలు జారీ అయినట్టు తెలుస్తోంది. కొందరు విధినిర్వహణలో ఇటీవల రూల్స్ బ్రేక్ చేసినట్టు భావించిన తెలంగాణ పోలీసు శాఖ ఈ మేరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరోసారి గుర్తుచేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో డీజేపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర పోలీసువర్గాల గ్రూపుల్లో ఈ ఆదేశాలు చక్కర్లు కొడుతున్నట్టు సమాచారం.
గత రెండు మూడేళ్లుగా ప్రైవేట్ కార్యక్రమాలు, ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలలో విధుల్లో పాల్గొనే పోలీసులు యూనిఫామ్‌లోనే డ్యాన్సులు వేయడం, స్పీచ్‌లు ఇవ్వడం, ప్రయివేటు కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వంటివి చేస్తున్నట్టు పోలీసుశాఖ గుర్తించింది. ఇటీవల వినాయక చవితి నిమజ్జన సమయంలో ట్యాంక్ మీద కొందరు పోలీసులు డీజే సప్పుళ్లకు డ్యాన్స్ చేయగా.. ఆ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అందులో మహిళా పోలీసులతో పాటు పురుషులు కూడా ఉన్నారు.
యూనిఫాం అనేది క్రమశిక్షణకు సింబల్ అని, అది మరువొద్దని, అలా చేయడం వలన ప్రజల్లో పోలీసుల మీద నమ్మకం, భద్రతా భావం పోయే అవకాశం ఉంటుందని రాష్ట్ర పోలీసు శాఖ ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. యూనిఫామ్ ధరించి వీధుల్లో ఉండగా ఈవెంట్స్‌లో పాల్గొనడం కూడా నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నట్టు తెలిసింది.
దీంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఈ విషయంలో కాస్త కట్టడి చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించినట్లు సమాచారం. డీజీపీ సూచనల మేరకు అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ అయినట్టు ఓ జిల్లా పోలీసులకు వచ్చిన ఆదేశాలను బట్టి తెలుస్తోంది. దాని సారాంశం ఇలా ఉంది. ‘డీజీపీ ఆదేశాల ప్రకారం ఏ పోలీస్ అధికారి/సిబ్బంది కూడా పోలీస్ యూనిఫాం ధరించి ఎలాంటి డ్యాన్స్ లేదా ఇతర కార్యక్రమాలలో పాల్గొనరాదు.
నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి.ఈ విషయాన్ని సిబ్బంది అందరికీ కచ్చితంగా తెలియజేయండి’ అని ఉన్నట్టు సమాచారం.ఇదిలాఉండగా వాళ్ళు కూడా మనుషులే అని.. ఒకవిధంగా శ్రమ, ఒత్తిడి నుండి కాస్త రిలాక్స్ అవుతారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. కాగా, పోలీస్ సహా భద్రత రక్షణ సంబంధిత శాఖలకు సంబంధించిన యూనిఫామ్ కు ప్రత్యేకత ఉంటుందని మరికొందరు అభిప్రాయం తెలుపుతున్నారు.


