Trump: పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధంపై ప్రపంచ దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. అంతర్జాతీయ వర్గాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు మొదలయ్యాయి. నెలల తరబడి సాగుతున్న పోరులో దౌత్యపరమైన ఒత్తిళ్లకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గకపోవడంతో, ఆ దేశాన్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సంప్రదాయ ఆయుధాల్లోనే అత్యంత భయంకరమైన అస్త్రంగా పిలిచే 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' (MOAB)ను ఇరాన్‌పైకి ప్రయోగించేందుకు అమెరికా సైనిక వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయని, దీనికి ట్రంప్ నుంచి కూడా అనుమతి లభించినట్లు ప్రచారం జరుగుతోంది.
అణు కేంద్రాలు, పవర్ గ్రిడ్లే టార్గెట్
ఇరాన్ అణు కేంద్రాలు ఉన్న పీక్యార్ట్స్ పర్వత ప్రాంతంతో పాటు, ఆ దేశ కీలక ఇంధన, విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు ముందు లేదా ఆ తర్వాత ఈ మెగా దాడిని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధం పట్ల స్వదేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, ఇరాన్‌కు గట్టి హెచ్చరిక పంపాలనే ఉద్దేశంతో యూఎస్ ఆర్సెనల్లోని అత్యంత శక్తివంతమైన నాన్-న్యూక్లియర్ బాంబు 'GBU-43/B MOAB'ను వాడాలని అమెరికా వ్యూహకర్తలు సిఫార్సు చేస్తున్నారు.
ఒకేసారి 9 సిటీ బ్లాకులు తుడిచిపెట్టుకుపోతాయా?
ఈ 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' సామర్థ్యం తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. దాదాపు 21,600 పౌండ్ల బరువుండే ఈ భారీ బాంబు పూర్తిగా జీపీఎస్ మార్గదర్శకత్వంతో పనిచేస్తుంది. ఇది ఒక్కసారి విస్ఫోటనం చెందితే ఏకకాలంలో తొమ్మిది సిటీ బ్లాకుల పరిధిని నామరూపాలు లేకుండా చేయగలదు. అయితే ఇది లోతైన భూగర్భ బంకర్లను ఛేదించే అస్త్రం కాదని, ఉపరితలంపై ఉన్న భారీ నిర్మాణాలను, ఎనర్జీ నెట్‌వర్క్‌లను క్లియర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నేలను తాకకముందే గాలిలోనే పేలిపోయి భయంకరమైన షాక్‌వేవ్‌లను సృష్టిస్తుంది. గతంలో 2017లో అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలపై మొదటిసారి దీన్ని ప్రయోగించినప్పుడు భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.
అమెరికా సైనికుల ప్రాణాలు కాపాడే సింబాలిక్ విక్టరీ!
భూతల బలగాలను రంగంలోకి దించడం ద్వారా మాత్రమే ఇరాన్‌ను నియంత్రించగలమని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ, అమెరికన్ జవాన్ల ప్రాణాలను పణంగా పెట్టేందుకు ట్రంప్ సిద్ధంగా లేరు. పైగా సుదీర్ఘ పోరును త్వరగా ముగించాలన్నా, ఇరాన్‌ను మానసికంగా దెబ్బతీసి దారికి తెచ్చుకోవాలన్నా ఒక బలమైన 'సింబాలిక్ విజయం' అత్యవసరమని భావిస్తున్నారు. అందుకే గ్రౌండ్ ట్రూప్స్‌ను పంపకుండానే ఒక సైకలాజికల్ వెపన్‌గా ఈ బాంబును ప్రయోగించి, సైనిక దళాలను వెనక్కి రప్పించాలనే వ్యూహంతో అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా సరికొత్త యుద్ధ జ్వాలలకు దారితీసేలా కనిపిస్తున్నాయి.


