Cm Revanth: కార్ల తయారీ పరిశ్రమ స్థాపించడానికి హైదరాబాద్ అనువైన ప్రాంతమని హ్యుందాయ్ ఇండియా సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ లో హ్యుందాయ్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యాన్ని రేవంత్ కోరారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ తో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది.
రూ.8,528 కోట్ల భారీ పెట్టుబడి
జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ)లో రూ.8,528 కోట్ల భారీ పెట్టుబడితో గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటునకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు సీఎం రేవంత్. అంతేకాదు ప్లాంట్ ఏర్పాటునకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అనుమతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిమ్జ్ లో 678 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. హ్యుందాయ్ కేంద్రం ద్వారా 4,276 ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి.
అత్యంత సురక్షితమైన నగరం
''భౌగోళికంగా తెలంగాణ దేశంలో మధ్య భాగంలో ఉంది. దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా, అత్యంత సురక్షితమైనదిగా, జీవించేందుకు అత్యంత అనుకూలమైన నగరంగా గుర్తింపు పొందింది” అని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.
ప్రాజెక్టు పురోగతిని హ్యుందాయ్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది. రానున్న కొన్ని నెలల్లో ఈ కేంద్రానికి శంకుస్థాపనకు సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. 2024లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) సమావేశాల సందర్భంగా, తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో సమావేశమైంది. 2025 జూన్లో హ్యుందాయ్ ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటుకు మంత్రివర్గ పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక ఉపసంఘం ఆమోదం తెలిపింది.
కార్ల తయారీ పరిశ్రమకు అనుకూలమైన ప్రాంతం
కార్ల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు రాష్ట్రం అత్యంత అనుకూలమైన ప్రదేశమని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్లు, రహదారి, విమాన, రైలు మార్గాల ద్వారా బలమైన రవాణా మౌలిక సదుపాయాలు, భవిష్యత్తులో ఓడరేవులతో హైస్పీడ్ రవాణా అనుసంధానాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలు రాష్ట్రానికి మరింతగా అనుకూలంగా మారుతాయని వివరించారు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని ఆహ్వానం
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలన్న ప్రభుత్వ దార్శనికతను ముఖ్యమంత్రి రేవంత్ వారికి వివరించారు. 2026లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా హ్యుందాయ్ నాయకత్వ బృందాన్ని ఆయన ఆహ్వానించారు. “తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాం” అని HMIE మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో చెప్పారు.


