అధికారం, అంగబలం, ఆస్తులు కావాలంటే రాజకీయాలే కేరాఫ్ అనేలా నేటి పాలిటిక్స్ మారుతున్నాయి. పూట గడవడమే కష్టంగా ఉన్నవాళ్లు.. రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే కోట్లకు పడగలెత్తుతున్నారు.. నిన్నటి వరకు సాధారణ జీవితం గడిపిన కొందరు నేతలు.. నేడు లగ్జరీ కార్లు, ఖరీదైన భవనాలు, వందల కోట్ల ఆస్తులతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజాసేవే లక్ష్యమంటూ రాజకీయాల్లోకి వచ్చి.. తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తులు సంపాదించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్వార్థంతో కూడిన నేటి రాజకీయాలు ప్రజల తలరాతలు మార్చే వేదికలనే నమ్మకాన్ని సమాధి చేసి..నేతల ఆస్తులు పెంచే కల్పవృక్షంలా మారాయనే ఆరోపణలున్నాయి.. ఇక నేతలు ఎన్నికల అఫిడవిట్లలో చూపిస్తున్న ఆస్తుల లెక్కలకు.. వాస్తవ ఆస్తులకు పొంతన ఉండటం లేదు.. అలాగే ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్ కోల్పోతుందనే అనుమానం వస్తే.. బినామీలను నిలపెట్టి ఓట్లు చీల్చే ప్రయత్నాల వంటి ఎన్నో దిగజారుడు పనులకు తెగబడటం కనిపిస్తుంది.
ఇక రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుని ఎన్నో పార్టీలు ప్రజా సంక్షేమం పేరు చెప్పుకుని పుట్టుకొస్తున్నాయి. కానీ చివరి వరకు నిలదొక్కుకోలేక, ప్రజాధారణ పొందలేక.. పార్టీని స్థాపించిన నేతలు ఇతర పార్టీలో కలిపేసి చేతులు దులిపేసుకుంటున్నారు. అయితే సాధారణంగా నిఖార్సైన ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించాలంటే మేధోమథనం జరగాలి, పార్టీ అజెండా రూపుదిద్దుకోవాలి, ఆర్థిక వనరులు సమకూరాలి, ఏళ్ల తరబడి ప్రణాళికలు ఉండాలి.
కానీ, ఇప్పుడు అలాంటివి ఏవి లేకుండా దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పై అంతుచిక్కని అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి?.. 2026 మే నెలలో సుప్రీంకోర్టులో యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల చుట్టూ వివాదం చెలరేగింది. ఈ విమర్శలు నిరుద్యోగ యువతను కించపరిచేలా ఉన్నాయనే ఆందోళన సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది.
ఈ సందర్భాన్ని ఆధారంగా చేసుకుని అభిజీత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వ్యంగ్యాత్మక డిజిటల్ వేదికను ప్రారంభించారు.. కాగా ఈ వ్యంగ్య నిరసన ఉద్యమం, కేవలం కొద్ది రోజుల్లోనే కోట్లాది మంది యువతను ఆకర్షించింది. మొదటగా నిరుద్యోగం, ప్రశ్నపత్రాల లీకేజీ, వ్యవస్థాపక వైఫల్యాల మీద CJP ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష పత్రం లీకేజీ మీద చేపట్టిన నిరసనలు జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. మొదట దీనిని తేలికగా తీసుకున్నా చివరకు విద్యా శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ రాజీనామాకు దారితీసింది.
ఇలా సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఈ డిజిటల్ నిరసన క్రమంగా ఒక పకడ్బందీ ప్రణాళికతో వీధి పోరాటాలుగా మారి, చివరికి అధికార రాజకీయాల వైపు వేగంగా అడుగులు వేసిందనే ఆరోపణలున్నాయి. అయితే ఒక పార్టీ ఉన్నతమైన ఆశయంతో పుట్టినప్పుడు సుదీర్ఘ కాలం ఆశయాల కోసం బ్రతకాలి. రాజకీయ కుట్రలు ఎన్ని జరిగిన వారి ఒత్తిడికి తల వంచకుండా.. ఒక నిర్ధిష్టమైన ప్రణాళికలతో ప్రజల్లో ఆదరణ పొందాలి. కానీ బొద్దింకల విషయంలో ఇవేవీ కనిపించలేదు.
పురిటి నొప్పులు లేకుండా పుట్టిన బిడ్డ మీద తల్లికి తక్కువ ప్రేమ ఉంటుందనే సామెత లా CJP కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వేగంగా ప్రచారం సంపాదించుకుంది. ఇక అప్పటికే బీజేపీ ప్రవాహానికి అడ్రస్ లు గల్లంతు అవుతున్న ఇతర పార్టీలకు ఈ బొద్దింకలు అమావాస్య చీకట్లో వెన్నెలలా కనిపించాయని.. దీంతో చీకటి ఒప్పందం చేసుకుని అన్నీ అస్త్రాలను కమలం పై ప్రదర్శిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
ముఖ్యంగా అధికార బీజేపీని సైతం వణికించిన ఈ యువతరంగం శక్తిని చూసి విపక్షాలైన ఇండియా (INDIA) కూటమి నేతలు లోలోపల బెంబేలెత్తిపోయారు. అధికార పక్షాన్ని సైద్ధాంతికంగా, వ్యూహాత్మకంగా ఎదుర్కొనే దమ్ము లేక, ప్రజా సమస్యలపై సొంతంగా సుదీర్ఘ పోరాటాలు చేసే సత్తా సన్నగిల్లిపోవడంతో... విపక్షాలు ఈ యువజన ఉద్యమాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం దత్తత చేసుకున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి..
అందుకే కొన్ని ప్రాంతీయ పార్టీల ఎంపీలు, కాంగ్రెస్ అగ్రనేతలు ఈ ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నట్లు ప్రకటించడం వెనుక కేవలం మొసలి కన్నీరు మాత్రమే ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి, బీజేపీపై పోరాడే శక్తి లేక... యువత చిందించిన చెమటను, రక్తాన్ని తమ రాజకీయ మైలేజీ కోసం వాడుకోవాలని ఇండియా కూటమి నాయకులు కుట్రపూరిత పావులు కదుపుతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తుంది.
మరోవైపు దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థ కుప్పకూలడం వంటి తీవ్రమైన ప్రజా సమస్యలు కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ, వాటిపై ప్రజలను ఏకం చేసే సమర్థవంతమైన ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలున్నాయి. సొంతంగా ప్రజా సమస్యలపై పోరాడి విజయం సాధించే సామర్థ్యం లేక, ఎక్కడో సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య ఉద్యమం (CJP) అకస్మాత్తుగా ఊపందుకునేసరికి, దాన్ని తమ వైపునకు తిప్పుకోవాలని చూశారే తప్ప.. కూటమి నేతలు తమ వైఫల్యాలను సరిదిద్దుకునే ఆత్మవిమర్శను చేసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి..
అదీగాక CJPని అడ్డు పెట్టుకుని కొత్త రాజకీయాలకు తెరతీస్తున్నారని అంటున్నారు. కూటమి నాయకులు ఇక్కడే ఆగిన బాగుండేది. కానీ దేశ పరువుతీసేలా వారి వ్యవహారం ఉందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు దేశానికి ప్రమాదం బయటి శత్రువుల నుండి కాకుండా ఇక్కడి రాజకీయనేతలే బయటి వ్యక్తులుగా ప్రవర్తించడం చర్చలకు దారి తీస్తుందని అంటున్నారు.. దేశ భద్రతను బజారులో పెట్టె ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి..
మరోవైపు దేశంలో ఏ రాజకీయ పోరాటం జరిగినా స్వార్థ ప్రయోజనాలకు పావుగా మారిపోకుండా... నిజమైన నిరుద్యోగుల, బాధితుల గొంతుకగా నిలబడాలన్నదే దేశ ప్రజల ఆకాంక్ష.. ఇక ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పుడు దాన్ని గుర్తించడం ముఖ్యం.. ఆ అసంతృప్తిని రాజకీయ శక్తిగా మార్చడం మరో విషయం. దేశంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలు, పరీక్షల నిర్వహణపై ఆగ్రహం కొత్తగా పుట్టింది కాదు.. అయితే, ప్రధాన రాజకీయ పార్టీలు ఈ అంశాలను నిరంతరం ప్రజల ఎజెండాలో ఉంచలేకపోతున్నప్పుడు, వాటిని ముందుకు తీసుకొచ్చే కొత్త వేదికలకు అవకాశం ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు..
అలాంటి పార్టీల మాటున ఉగ్రవాద చర్యలు జరగకుండా.. వారి ఆలోచనలు, ఆశయాలు గతి తప్పకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాల పై, ప్రతి పక్షాల పై ఉందన్న విషయాన్ని విస్మరించకూడదని అంటున్నారు.. ఒక వేళ అదే జరిగితే అధికార దాహంతో అలమటించి పోతున్న రాజకీయం చాటున ఉన్న రాబంధులు వారిని తప్పుదోవ పట్టించి వ్యవస్థను నాశనం చేసి.. దేశాన్ని సంక్షోభంలోకి నెట్టే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు..
ఇక నానాటికీ దిగజారిపోతున్న రాజకీయ విలువలను ఆసరాగా చేసుకుని పుట్టుకొస్తున్న పార్టీలను పావులుగా వాడుకుని.. ఆరాచకాలను ప్రోత్సహిస్తున్న పార్టీలు కూడా దేశ భద్రత వ్యవస్థ, యువత భవిష్యత్తు గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. లేదంటే అధికారం కోసం చేస్తున్న ఇలాంటి రాజకీయాలే రానున్న కాలంలో దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశాలున్నట్టు పేర్కొంటున్నారు. ఇక ఆధిపత్య పోరు ప్రపంచానికైనా, దేశానికైనా, రాష్ట్రానికైనా, మనుషులకు అయిన ఎన్నటి ప్రమాదమే!!..


