తెలంగాణ

Medicover: మెడికవర్ హాస్పిటల్‌లో మరో దారుణం.. చికిత్స కోసం వెళ్లిన చిన్నారి మృతి

రచన: NK•••4 నిమిషాల పఠనం

Medicover: సికింద్రాబాద్ లోని మెడికవర్ హాస్పిటల్ వివాదాలకు కేరాఫ్ గా మారింది. అక్కడ వరుసగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మెడికవర్ ఆసుపత్రి తాజాగా మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. చికిత్స కోసం వెళ్తే ప్రాణాలే పోతున్నాయి. ట్రీట్ మెంట్ కోసం వచ్చిన చిన్నారి చనిపోయింది.

Medicover: సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్ వివాదాలకు కేరాఫ్ గా మారింది. చికిత్స కోసం వెళ్తే ప్రాణాలే పోతున్నాయి. కిడ్నీలో రాళ్లకు చికిత్స చేయించుకోవడానికి మెడికవర్ ఆసుపత్రికి వెళ్లిన యువ న్యాయవాది ఐశ్వర్య చనిపోయిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. అది మరువకముందే..

అక్కడ మరో దారుణం చోటు చేసుకుంది. ట్రీట్ మెంట్ కోసం వెళ్లిన ఓ చిన్నారి అనూహ్యంగా మరణించింది. అంతేకాదు పాప చనిపోయిన విషయాన్ని దాచి చికిత్స అందిస్తున్నట్లు మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది ఆడిన డ్రామా విస్మయానికి గురి చేసింది. ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే వల్లే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

సెప్టెంబర్ 11న తల్లిదండ్రులు తమ రెండేళ్ల పాప గుణశ్రీని చికిత్స కోసం సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తమ పాప బాగానే ఉందని తెలిపారు. పాపకు ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించాలని చెప్పిన సిబ్బంది.. ప్రాథమిక పరీక్షలు చేయకుండానే అనస్థీషియా ఇచ్చారని.. దీంతో ఎంఆర్‌ఐ మెషిన్‌పైనే పాప చనిపోయిందని తెలిపారు. ఉదయం 10 నుండి 11 గంటల మధ్య చిన్నారి చనిపోతే, సాయంత్రం 4 గంటల వరకు చికిత్స అందిస్తున్నట్లు 'ఠాగూర్' సినిమా తరహాలో ఆసుపత్రి సిబ్బంది డ్రామా ఆడారని పాప తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు.

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందన్నారు. అసలేం జరిగిందో చెప్పడం లేదని, చికిత్సకు సంబంధించిన రిపోర్టులు కూడా ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. ఒక ఉద్యోగిపై తప్పు నెట్టి, అతడిని ఉద్యోగం నుండి తొలగించి ఆసుపత్రి యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని చిన్నారి తల్లిదండ్రులు మండిపడ్డారు.

యాజమాన్యం వైఖరికి నిరసనగా పాప తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కాగా, ఆసుపత్రి సిబ్బంది తమ పట్ల దురుసుగా వ్యవహరించారని.. పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారని చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఐశ్వర్య, నేడు గుణశ్రీ.. చికిత్స కోసం వెళ్లి ప్రాణాలే కోల్పోయారు. సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వరుస వివాదాలు అక్కడ చికిత్స పొందుతున్న రోగులను, వారి కుటుంబసభ్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

#Medicover Hospital#Secunderabad#Child Death#Treatment#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి