SantiagoMartin: తమిళనాడులో ఉప్పు - నిప్పులా ఉండే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఎన్నికల ఖర్చులకు ఒకే ఒక్క లాటరీ కంపెనీ భారీగా డబ్బులు ఇచ్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కోల్‌కతా కేంద్రంగా నడిచే 'టైగర్ అసోసియేట్స్' అనే లాటరీ సంస్థ.. ఈ రెండు పార్టీలకు కలిపి ఏకంగా రూ. 260 కోట్లు విరాళంగా ఇచ్చిందని ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా ‘లాటరీ కింగ్’గా పేరున్న శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఈ సంస్థ, పోయినేడాదితో పోలిస్తే ఈసారి డబుల్‌కి పైగానే ముట్టజెప్పింది. పోయినేడాది రూ. 110 కోట్లు ఇస్తే, ఈ ఏడాది ఏకంగా రూ. 260 కోట్లకు పెంచేసింది. ఇందులో అన్నాడీఎంకే ఖాతాలో రూ. 135 కోట్లు పడగా, డీఎంకేకు రూ. 125 కోట్లు ఇచ్చారు.
అసలు ట్విస్ట్ ఏంటంటే.. అన్నాడీఎంకేకు వచ్చిన మొత్తం ఫండ్స్‌లో 81 శాతం డబ్బులు ఈ ఒక్క కంపెనీ నుంచే వచ్చాయి. అటు డీఎంకేకు వచ్చిన మొత్తం ఫండ్స్‌లోనూ 65 శాతం వాటా ఈ లాటరీ సంస్థదే. బయట చూస్తేనేమో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు, తీరా చూస్తే పార్టీలను నడిపించేందుకు కావాల్సిన డబ్బులు మాత్రం ఒకే సంస్థ నుంచి తీసుకుంటుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మరోవైపు మార్టిన్ ప్లానింగ్ మామూలుగా లేదనే కామెంట్స్ కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఆయన కుటుంబం తమిళనాడు, పుదుచ్చేరిలోని అన్ని ప్రధాన పార్టీల్లోనూ పాతుకుపోయింది. మార్టిన్ భార్య లీమారోస్ అన్నాడీఎంకేలో ఉండగా, అల్లుడు అధవ్ అర్జున టీవీకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇక కొడుకు జోస్ చార్లెస్ పుదుచ్చేరిలో సొంత పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంట్లో వాళ్లంతా వేర్వేరు పార్టీల్లో ఉంటూ, అటు ప్రధాన పార్టీలన్నింటికీ వందల కోట్లు కుమ్మరిస్తూ.. అధికారం ఎవరి చేతికి వచ్చినా తన వ్యాపారాలకు ఎదురులేకుండా మార్టిన్ పక్కాగా స్కెచ్ వేశారనే టాక్ నడుస్తోంది.


