ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజ్నెవా) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి మెట్లమార్గంలో తిరుమల కొండకు చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం(ఈరోజు) తెల్లవారుజామున ఆలయంలో జరిగిన సుప్రభాత సేవలో ఆమె పాల్గొని స్వామివారిని కొలిచారు. అనంతరం పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు.

అనా కొణిదెల విదేశీయురాలు (ఇతర మతస్థురాలు) అయినప్పటికీ, కలియుగ దైవమైన శ్రీవారి పట్ల ఆమె చూపిన భక్తి ప్రపత్తులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పూర్తిగా హిందూ ఆచారాలను పాటిస్తూ నిండైన తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ చీర ధరించి, నుదుట బొట్టుతో అచ్చమైన తెలుగు ఇల్లాలుగా ఆమె కనిపించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె ఆలయానికి వచ్చిన తీరును చూసి తిరుమలలోని భక్తులతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా అనా కొణిదెలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. "ఇతర దేశంలో పుట్టి, మరో మతానికి చెందినవారైనా.. మన తెలుగు సంస్కృతిని, సనాతన ధర్మాన్ని ఇంతగా గౌరవించడం గొప్ప విషయం" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె శ్రీవారిని దర్శించుకున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మరికొందరు అభిమానులైతే పవన్ కల్యాణ్ సతీమణిని చూసి మురిసిపోతున్నారు. మెగా కుటుంబ కోడలిగా మన సంప్రదాయాలకు ఆమె ఇస్తున్న విలువను కొనియాడుతున్నారు.

రూ.17లక్షల భారీ విరాళం అందజేత
ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్‌కు భుజానికి ఆపరేషన్ (శస్త్రచికిత్స) జరిగిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని, మొక్కులు చెల్లించుకునేందుకు అన్నా లెజినోవా అలిపిరి కాలినడక మార్గం ద్వారా తిరుమల కొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ పేరిట శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. అనంతరం తిరుమల అన్నదాన సత్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించడమే కాకుండా, సాధారణ భక్తులతో కలిసి కూర్చుని ఆమె కూడా ప్రసాదాన్ని స్వీకరించారు.

https://x.com/TeluguChegu/status/2078349774676475946?s=20












