తెలంగాణ

Adilabad: గిరిజన మహిళల రుణాల్లో భారీ గోల్‌మాల్!!..

రచన: Venu4 నిమిషాల పఠనం

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి.. వారిని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందిస్తోంది. ఐకేపీ వంటి వ్యవస్థల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తూ.. గ్రామీణ, గిరిజన మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి.. వారిని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందిస్తోంది. ఐకేపీ వంటి వ్యవస్థల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తూ.. గ్రామీణ, గిరిజన మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. అయితే ఇలాంటి పథకాల అమలులో కొందరి అక్రమాలు పేద మహిళలను నష్టాల్లోకి నెడుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సావరీ గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. గ్రామంలో మొత్తం 13 మహిళా సంఘాలు ఉండగా.. 2021-22 సంవత్సరంలో బ్యాంకు లింకేజీ ద్వారా సంఘాలకు రుణాలు అందించారు. అయితే మూడు మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యుల అనుమతి లేకుండానే, ఎలాంటి తీర్మానం లేకుండానే.. మూడు గ్రూపులకు కలిపి రూ.4 లక్షల 5 వేల మొత్తాన్ని విఓఏగా పనిచేస్తున్న న్యానేశ్వర్ బ్యాంకు నుంచి డ్రా చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

రుణాల రికవరీ కోసం ఐకేపీ సిబ్బంది గ్రామానికి వచ్చిన సమయంలో కూడా సరైన స్పందన లేకపోవడంతో విషయం ఇంతకాలం బయటకు రాలేదు. మరోవైపు గత ఏడు నెలలుగా న్యానేశ్వర్ గ్రామంలో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇటీవల రుణాల వసూళ్ల కోసం వచ్చిన సీసీ రేణుక.. సర్పంచ్ సమక్షంలో విఓ సమావేశం నిర్వహించడంతో అసలు వ్యవహారం బయటపడింది.

తాము ఎలాంటి రుణం తీసుకోలేదని.. అలాంటప్పుడు రుణం ఎలా చెల్లించాలంటూ మహిళా సంఘాల సభ్యులు ప్రశ్నించడంతో నిధుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అవినీతికి గురైతే.. వాటి లక్ష్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా గిరిజన, నిరుపేద మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రుణాల మంజూరు నుంచి నగదు ఉపసంహరణ వరకు ప్రతి దశలో పారదర్శకత ఉండేలా అధికారులు పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలి. ప్రభుత్వ పథకాల నిధులు పేద మహిళల అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప.. అవినీతికి బలికాకూడదు. సావరీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు.. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..

#Adilabad#Gadiguda#Savari#Women groups#loansfraud#tribal women
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి