తెలంగాణ

Erravalli Farmhouse: కేసీఆర్ భూముల లెక్కలు.. ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదు..?

రచన: Mahesh6 నిమిషాల పఠనం

Erravalli Farmhouse: తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పేల్చిన ‘ఎర్రవల్లి బాంబు’ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కేసీఆర్ ఫాంహౌస్‌లో కలిపేశారని, వందల ఎకరాల అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారని రేవంత్ సభ సాక్షిగా లెక్కలు బయటపెట్టారు.

Erravalli Farmhouse: తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పేల్చిన ‘ఎర్రవల్లి బాంబు’ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కేసీఆర్ ఫాంహౌస్‌లో కలిపేశారని, వందల ఎకరాల అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారని రేవంత్ సభ సాక్షిగా లెక్కలు బయటపెట్టారు. అయితే సీఎం ప్రసంగం ముగిసిన వెంటనే రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ ఒకటే సందేహం మొదలైంది.

ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే ధరణి లొసుగులు, ఎర్రవల్లి బాగోతంపై పోరాడిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కి మూడేళ్లు పూర్తవుతున్నా ఇన్ని రోజులు ఈ ఫైళ్లను ఎందుకు కదల్చలేదు? అసెంబ్లీ సాక్షిగా ఇంత సడన్‌గా ఆ లెక్కల చిట్టా విప్పాల్సిన అవసరం ఇప్పుడే ఎందుకొచ్చింది?

అప్పుడు రేవంత్ దగ్గర ఆధారాలు లేవా?

ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు, వందల ఎకరాలు కూడబెట్టారని రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఎన్నో వేదికలపై గళమెత్తారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ దోపిడీని ఎండగట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామని, అక్రమ భూములను పేదలకు పంచుతామని ప్రచారం చేశారు. అన్నట్లుగానే ప్రజా తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ అన్ని వ్యవస్థలు, రెవెన్యూ యంత్రాంగం తన చేతిలో ఉన్నప్పుడు.. బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే ఈ భూముల వివరాలు ఎందుకు నిగ్గు తేల్చలేదు? దాదాపు మూడేళ్ల పాటు ఫైళ్లను భద్రంగా దాచిపెట్టి, సరిగ్గా ఇప్పుడు శాసనసభ వేదికగా బయటకు తీయడం వెనుక రాజకీయ మర్మం ఏమిటనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

22A సెగ నుంచి తప్పించుకునే వ్యూహమా?

ప్రస్తుతం రాష్ట్రంలో 22A నిషేధిత భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. భూ యజమానులు, రైతులు రిజిస్ట్రేషన్లు కాక, కార్యాలయాల చుట్టూ తిరగలేక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల హామీలు, పాలనాపరమైన వైఫల్యాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ముప్పేట దాడి చేస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో ప్రభుత్వానికి సెగ తగులుతున్న ఈ తరుణంలోనే కేసీఆర్ కుటుంబ భూముల చిట్టాను సీఎం తెరపైకి తేవడం యాధృచ్ఛికమేనా? అసలు 22A సమస్యలపై జవాబు చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి, ప్రజల ఆలోచనలను గులాబీ బాస్ ఫాంహౌస్ వైపు మళ్లించేందుకే ఈ ‘ఎర్రవల్లి అస్త్రం’ సంధించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డైవర్షన్ పాలిటిక్స్ కే పరిమితమా?

సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పాలనలో సమస్యలు ఎదురైనప్పుడు లేదా ప్రతిపక్షాల నుంచి ఊహించని ఒత్తిడి పెరిగినప్పుడు ప్రత్యర్థుల పాత కేసులను బయటకు తీయడం రాజకీయాల్లో రివాజుగా మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారా అనే వాదనలు బలపడుతున్నాయి. కేసీఆర్ ఫాంహౌస్ అక్రమాలను నిజంగానే అడ్డుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే.. మూడేళ్ల క్రితమే రెవెన్యూ విచారణ జరిపి, నోటీసులు ఇచ్చి భూములను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా, ఉన్నట్టుండి సభలో లెక్కలు చదవడం వెనుక ఉన్నది చిత్తశుద్ధా లేక పక్కా పొలిటికల్ మైలేజా అన్నది చర్చనీయాంశమైంది.

అక్రమాలు జరిగితే నిగ్గు తేల్చడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఆ చర్యలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఉపయోగపడే ‘డైవర్షన్ పాలిటిక్స్’గా మారితే మాత్రం ప్రజలు స్వాగతించరు. ఇన్ని రోజులు ఎందుకు దాచారు అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. కేవలం సభలో ఆరోపణలు చేయడమే కాకుండా, చెప్పినట్లుగా ఆ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని దళితులకు పంచిపెట్టి రేవంత్ సర్కార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇది మరో రాజకీయ మైలేజ్ డ్రామాగానే మిగిలిపోతుంది.

#Erravalli Farmhouse#KCR#K Chandrashekar Rao#Revanth Reddy#Telangana Politics#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి