Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్, రేవంత్ నిజాంను పొగడటం సిగ్గుచేటన్నారు. దేశమంతా 1947లో స్వాతంత్ర్యం పొందితే తెలంగాణకు ఏడాది ఆలస్యంగా స్వేచ్ఛ లభించిందన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో తెలంగాణకు నిజాం రజాకార్ల దౌర్జన్యాల నుంచి విముక్తి లభించిందని ఆయన గుర్తుచేశారు.
అలాంటి నిజాంను పొగిడే నాయకులు ఓసారి ఇక్కడి పోరాట చరిత్రను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ ప్రజలు విమోచనం సాధించుకున్నారని బండి సంజయ్ తెలిపారు. చరిత్రను పక్కనపెట్టి నిజాంను గొప్పవాడిగా చిత్రీకరించడం సరికాదన్నారు. నిజాంను పొగడటం అంటే.. నిజాం పాలనలో బలైన వీరుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడటమే అని, తెలంగాణ సమాజాన్ని అగౌరవపరచడమేనని విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్రం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు.
తెలంగాణ పోరాట చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని బండి సంజయ్ తెలిపారు. కొంతమంది కుహనా సెక్యులర్ వాదులు తెలంగాణలో రాజ్యమేలుతున్నారన్న బండి సంజయ్.. తెలంగాణ విమోచన చరిత్రను మతం కోణంతో చూడటం సిగ్గుచేటు అన్నారు. నిజాం పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు చేశారని, ఎంతోమందిని చంపిన నీచులు రజాకార్లు అని ఆయన అన్నారు.
ముస్లింల ఓట్ల కోసం నిజాంను కేసీఆర్, సీఎం రేవంత్ పొగుడుతున్నారని.. వారి తీరు చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని బండి సంజయ్ విమర్శించారు. అసెంబ్లీలో నిజాంను ప్రశంసిస్తూ సీఎం రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకుని రక్తపాతం సృష్టించిన నిజాం పాలనను ఎలా సమర్థిస్తారని నిలదీశారు. నిజాంను పొగిడే నేతలకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలి.. అసలు వారు ఈ దేశ పౌరులేనా? లేక విదేశీ డీఎన్‌ఏ ఉందా? అనేది చూడాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.
నిజాంను పొగిడినందుకు సీఎం రేవంత్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాలను వారం రోజుల పాటు అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించారు.











