TG : తెలంగాణ శాసనసభ వేదికగా మొదలైన 22A నిషేధిత భూముల రగడ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. "మీరు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశారు" అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గర్జిస్తే.. "మీ కుటుంబానికే 300 ఎకరాలకు పైగా లెక్కల్లో లేని ఆస్తులున్నాయి" అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియా ముందు ఎదురుదాడికి దిగారు.
నిజానికి ఇరుపక్షాలు విసిరిన లెక్కల బాంబులతో సామాన్య జనాలు విస్తుపోతున్నారు. అయితే ఈ ఆరోపణల పర్వంలో నాయకులు చెబుతున్నది ఎంత? రికార్డుల వెనుక దాగిన అసలు నిజాలెంత? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
ఎర్రవల్లిపై రేవంత్ బాంబు.. కేసీఆర్ ఫ్యామిలీ లెక్కలివే!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫాంహౌస్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తీవ్ర ఆరోపణలు చేశారు. రికార్డుల్లో కేసీఆర్ కుటుంబానికి 295 ఎకరాలు మాత్రమే ఉండగా, 2017 ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన (ధరణి) ముసుగులో సర్వే నెంబర్ 325లోని 388 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూమిని కలుపుకుని దాదాపు 700 ఎకరాల సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. ఆ 388 ఎకరాలను వెంటనే స్వాధీనం చేసుకుని 800 మంది దళితులకు పంచుతామని స్పష్టం చేశారు.
రేవంత్ సభలో బయటపెట్టిన కేసీఆర్ కుటుంబ భూముల చిట్టా.. ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం గరిష్టంగా 27 ఎకరాలే ఉండాల్సి ఉండగా కేసీఆర్-శోభ దంపతులకు 67.5 ఎకరాలు ఉంది. అలాగే కేటీఆర్ కుటుంబానికి 123.19 ఎకరాలు, హరీశ్ రావు దంపతులకు 30.5 ఎకరాలు, కవిత దంపతులకు 37.26 ఎకరాలు, ఎంపీ సంతోష్ రావు కుటుంబానికి 79.5 ఎకరాలు, నవీన్ రావు-కొండల్ రావులకు దాదాపు 100 ఎకరాలు ఉన్నాయి. మొత్తం 9 జిల్లాల్లోని 24 మండలాలు, 31 గ్రామాల్లో కలిపి కేసీఆర్ కుటుంబానికి 440 ఎకరాలకు పైగా భూములున్నాయని పేర్కొన్నారు. అలాగే
సత్యం రామలింగరాజు కుటుంబానికి చెందిన ‘శతభిష ఆగ్రో’ నిషేధిత భూములను కేటీఆర్ తన భార్య, అత్తమామల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.
హరీశ్ రావు ఎదురుదాడి..
సీఎం ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు అంతే దీటుగా స్పందించారు. నాడు 1000 ఎకరాల ఫామ్‌హౌస్ అని ప్రచారం చేసి, నేడు అసెంబ్లీలో 67 ఎకరాలని మాట మార్చారని ఎద్దేవా చేశారు. తమ ఆస్తులన్నీ ఐటీ రిటర్న్లు, అఫిడవిట్లలో పక్కాగా ఉన్నాయని, అధికారులు సర్వే చేస్తే తన భూమి రెండు గుంటలు తక్కువగానే తేలిందని స్పష్టం చేశారు.
అదే ఊపుతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ భూముల చిట్టాను హరీశ్‌రావు బయటపెట్టారు. రేవంత్ కుటుంబానికి కొట్రా గ్రామంలో 300 ఎకరాలు ఉన్నట్లు చెబుతుండగా, 175 ఎకరాలకు సంబంధించి తమ వద్ద పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే కొండారెడ్డిపల్లిలో 79 ఎకరాలు, ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 54 ఎకరాలు కలిపి రేవంత్ రెడ్డి, ఆయన కుమార్తె, తమ్ముళ్ల పేరిట ఏకంగా 308 ఎకరాలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
అసలు లెక్కలు చెప్పే ధైర్యం ఎవరికుంది?
అధికారంలో ఉన్నప్పుడు ధరణితో ఒకరు, ఇప్పుడు అధికార బలం చూపిస్తూ మరొకరు పరస్పరం వందల ఎకరాల అక్రమాలను లెక్కలు గట్టి చూపిస్తున్నారు. కానీ ఇరువర్గాలు చెబుతున్న ఈ లెక్కలు కేవలం రాజకీయ ప్రయోజనాలకే పరిమితమా లేక నిజంగానే లెక్కల్లో లేని ఆస్తులపై సమగ్ర విచారణ జరిపిస్తారా అన్నదే అసలు ప్రశ్న.
అసలు ఈ లెక్కలపై అసలైన వాళ్లు ఎలా స్పందిస్తారు.. హరీశ్ రావు కామెంట్స్‌పై ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పలేదు. అలాగే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై గులాబీ బాస్ మాట్లాడలేదు. అసలు వీటిపై ఏమైనా మాట్లాడతారా లేదంటే వట్టి అసత్య ఆరోపణలు అని మాట దాటేస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఒకరి భూములను మరొకరు బయటపెట్టే క్రమంలో.. ఇరుపక్షాలు తమ వద్ద ఉన్న ప్రతి గుంటకు సంబంధించి అసలైన, పారదర్శకమైన లెక్కలను ప్రజల ముందు ఉంచే సాహసం చేస్తాయా అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది.








