తెలంగాణ

Telangana:కేసీఆర్ పై రేవంత్ బ్రహ్మాస్త్రం!!..

రచన: Venu7 నిమిషాల పఠనం

ఒకవైపు బీఆర్ఎస్ పాలనలో భూ వ్యవహారాలపై కాంగ్రెస్ తన రాజకీయ వాదనను బలపరుస్తోంది. మరోవైపు కేసీఆర్ కుటుంబాన్ని నేరుగా చర్చలోకి తీసుకురావడం ద్వారా.. బీఆర్ఎస్ నేతలు గతాన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో ఇంతకాలం సాగిన మాటల యుద్ధం ఇప్పుడు మరో దశకు చేరుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను నేరుగా ఢీకొట్టడం కంటే బీఆర్ఎస్ పాలన, ఆ పార్టీ నేతలు, ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూముల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా.. ఆ రాజకీయ వ్యూహంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

బీఆర్ఎస్‌ను కేవలం రాజకీయ విమర్శలతో కాకుండా, గత పాలనలోని నిర్ణయాలు, ఆస్తులు, భూ లావాదేవీల చుట్టూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితిలోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలైనట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వ్యూహానికి మరింత బలం చేకూర్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన భూముల వివరాలను ప్రస్తావించిన సీఎం.. బీఆర్ఎస్ ముఖ్య నేతలు వేల కోట్ల విలువైన భూములు సొంతం చేసుకున్నారంటూ ఆరోపణలు చేశారు.

సత్యం స్కాంలో ఉన్న భూముల్లో కేటీఆర్ ఫామ్‌హౌస్ ఉందని, ఆ భూములు కేటీఆర్ బంధువుల పేర్లకు బదిలీ అయ్యాయని రేవంత్ ఆరోపించారు. హరీశ్‌రావు ఫామ్‌హౌస్‌కు సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో రోడ్డు నిర్మించారని, ఇరిగేషన్ కోసం తీసుకున్న భూముల్లోనే ఫామ్‌హౌస్ ఉందని కూడా పేర్కొన్నారు. బాలానగర్‌లో భూముల వ్యవహారంపైనా తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే రాజకీయ ఆరోపణలు ఒక స్థాయిలో ఉంటే.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై విచారణకు ఆదేశించడం మరో స్థాయి పరిణామంగా మారింది. కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్న భూముల రికార్డులు, యాజమాన్య హక్కులు, ప్రభుత్వ భూముల వివరాలను పూర్తిగా పరిశీలించాలని రేవంత్ ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ నివేదిక ఇవ్వాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ప్రభుత్వ భూములు ఉన్నట్లు తేలితే వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు, ఎస్సీ వర్గాలకు కేటాయించే అంశాన్ని కూడా రేవంత్ ప్రస్తావించారు.

ఇక్కడే రేవంత్ రాజకీయ వ్యూహం మరో కోణంలో కనిపిస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ పాలనలో భూ వ్యవహారాలపై కాంగ్రెస్ తన రాజకీయ వాదనను బలపరుస్తోంది. మరోవైపు కేసీఆర్ కుటుంబాన్ని నేరుగా చర్చలోకి తీసుకురావడం ద్వారా.. బీఆర్ఎస్ నేతలు గతాన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చేసిన విమర్శలకు కౌంటర్‌గా రేవంత్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ భూ వ్యవహారాలను ముందుకు తీసుకొస్తోంది.

అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణిస్తోంది. ఎన్నికల అఫిడవిట్లలో ఆస్తుల వివరాలు వెల్లడించామని చెబుతోంది. కాగా ఇప్పటివరకు రేవంత్ వర్సెస్ కేసీఆర్ పోరు ప్రధానంగా మాటల స్థాయిలో కనిపించింది. కానీ ఇప్పుడు నోటీసులు, రెవెన్యూ రికార్డులు, అధికారిక విచారణలు, భూముల స్వాధీనం వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి.

దీంతో ఈ వ్యవహారం కేవలం రాజకీయ విమర్శగా మిగిలిపోకుండా.. ప్రభుత్వ యంత్రాంగం తీసుకునే తదుపరి చర్యలపై ఆధారపడే దశకు చేరుతోంది. వచ్చే రోజుల్లో కేసీఆర్‌కు నోటీసులు జారీ అయితే.. ఆయన ఇచ్చే సమాధానం, బీఆర్ఎస్ చేసే న్యాయపరమైన పోరాటం, ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలు తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని పెంచే అవకాశం ఉంది. అలాగే ఎవరి వాదనకు అధికారిక రికార్డులు బలం చేకూరుస్తాయన్నదే ఇప్పుడు అసలు కీలక అంశంగా మారింది..

మరోవైపు రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రతి అడుగు వెనుక కేవలం పాలన మాత్రమే కాదు, ముందస్తు పొలిటికల్ చెక్ మెయిట్ దాగి ఉందని అంటున్నారు.. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడేలా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఉచ్చు బిగిస్తున్నారు.. ఆక్రమణల కూల్చివేతలు, పాత ఫైళ్ల రీ-ఓపెనింగ్, హైడ్రా యాక్షన్లు... ఇవన్నీ కేవలం పరిపాలనా నిర్ణయాలు మాత్రమే కావు..

గ్రౌండ్ లెవెల్‌లో బీఆర్ఎస్ కేడర్‌ను, అగ్రనేతలను మానసికంగా దెబ్బతీసే పొలిటికల్ స్ట్రాటజీ.. అలాగే క్యాడర్‌లో ధైర్యం సన్నగిల్లేలా చేస్తూ, క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీకి శ్వాస ఆడనివ్వకుండా రేవంత్ పక్కా స్కెచ్ అమలు చేస్తున్నారు. విపక్షం కోలుకోవడానికి సమయం ఇవ్వకుండా ఒక వివాదం ముగిసేలోపే మరొక దాడితో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మార్చడమే రేవంత్ మైండ్ గేమ్. రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌ను కేవలం ప్రతిపక్షంగా కాకుండా, రాజకీయంగా నిలదొక్కుకోలేని స్థితికి తీసుకురావడమే కాంగ్రెస్ వ్యూహంగా రాజకీయా విశ్లేషకులు భావిస్తున్నారు.. మరి చూడాలి రాబోయే రోజుల్లో రేవంత్ పొలిటికల్ గేమ్ ఆ పార్టీకి విజయాన్ని అందిస్తుందా? లేక బీఆర్ఎస్ కు మైలేజీ అందుతుందా? అనేది!!..

#Telangana#political News#CM Revanth reddy#KCR#Encroachment of lands#Erravalli Farmhouse
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి