ఒకప్పుడు వినాయక చవితి పండుగంటే ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మికత, భక్తిభావాలు ఉప్పొంగేవి.. ఇంటిల్లిపాదీ కలిసి మట్టి వినాయకుడిని పూజించడం, సాంప్రదాయ పిండివంటలు నైవేద్యంగా పెట్టడంలో ఎంతో ఆనందం ఉండేది. మండపాల్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి సాయంత్రాలు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతమైన వాతావరణం నెలకొనేది.
కానీ కాలక్రమేణా ఆ పండుగ స్వరూపమే మారిపోయింది. ప్రస్తుతం ఆధ్యాత్మికత కంటే ప్రదర్శనా బుద్ధి, పాశ్చాత్య ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీ ఆడంబరాలు, డీజేల హోరు, పాశ్చాత్య నృత్యాల మధ్య పండుగ తన నిజ స్వరూపాన్ని కోల్పోతుంది. మరోవైపు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, మైకులు, రసాయన రంగుల వాడకం పెరిగిపోయింది.
ఒకప్పటి భక్తి శ్రద్ధల స్థానంలో నేడు ఆడంబరాలే ప్రధానంగా మారడం విచారకరం. ఇక కొన్ని చోట్ల వేడుకలు అయితే ఇదెక్కడి భక్తి అన్నట్టు తయారయ్యాయి. మద్యం, డీజే డ్యాన్స్ లు, భక్తి పాటలు కాకుండా, అశ్లీల నృత్యాలతో వినాయక నవరాత్రుల ఉద్దేశమే మారిపోతుంది. సంస్కృతి, సంప్రదాయాలతో వినాయక నవరాత్రులను జరుపుకోవాలని ఆలోచించే వారే కరువైయ్యారు.. ఇలాంటి సమయంలో భక్తితో కూడిన మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
అందుకే ఈ పరిస్థితిని మార్చేందుకు సూర్యాపేటలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ నేత వల్లాస్ జానీ స్థానిక గణేష్ మండపాలకు ప్రత్యేక ప్రోత్సాహకం ప్రకటించారు. సూర్యాపేటలోని రాజీవ్ నగర్‌లో ఏర్పాటైన వినాయక మండపాల్లో మద్యం సేవించకుండా, నిష్ఠతో పూజలు నిర్వహించి, భక్తిభావంతో వేడుకలు జరిపి, క్రమశిక్షణతో నిమజ్జనం పూర్తి చేసిన మండపాలకు రూ.10,116 నగదు పురస్కారం అందిస్తామని ఆయన ప్రకటించారు.
భక్తి భావం ఉట్టిపడేలా "మద్యం వద్దు.. మహాగణపతి భక్తి ముద్దు" అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ బహుమతి కేవలం యువతలో బాధ్యతా భావం, సంప్రదాయాల పట్ల గౌరవం పెంచే సామాజిక సంస్కరణగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని, పర్యావరణాన్ని కాపాడుతూ సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ ఆలోచన కేవలం సూర్యాపేటకే పరిమితం కాకుండా ఇతర గ్రామాలు, పట్టణాల్లోని ఉత్సవ కమిటీలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ తరహా ప్రోత్సాహకాలను ప్రకటిస్తే కాస్త పరిస్థితి మారుతుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు..








