తెలంగాణ

Telangana Politics: కేసీఆర్ ఫామ్ హౌస్ పై విచారణ.. రేవంత్ కు కలిసొస్తుందా..?

రచన: Mahesh6 నిమిషాల పఠనం

Telangana Politics: తెలంగాణ గడ్డపై ఇప్పుడు ఒకటే చర్చ.. ఎర్రవల్లి ఫాంహౌస్‌ చుట్టూ రేవంత్ రెడ్డి సర్కార్ బిగిస్తున్న ఉచ్చు కాంగ్రెస్‌కు రాజకీయ లాభాన్ని తెచ్చిపెడుతుందా? లేక గతంలో పక్క రాష్ట్రంలో జరిగిన సీన్ రిపీట్ అయి గులాబీ బాస్‌కి తిరుగులేని ప్రజా సానుభూతిని కట్టబెడుతుందా?

Telangana Politics: తెలంగాణ గడ్డపై ఇప్పుడు ఒకటే చర్చ.. ఎర్రవల్లి ఫాంహౌస్‌ చుట్టూ రేవంత్ రెడ్డి సర్కార్ బిగిస్తున్న ఉచ్చు కాంగ్రెస్‌కు రాజకీయ లాభాన్ని తెచ్చిపెడుతుందా? లేక గతంలో పక్క రాష్ట్రంలో జరిగిన సీన్ రిపీట్ అయి గులాబీ బాస్‌కి తిరుగులేని ప్రజా సానుభూతిని కట్టబెడుతుందా? ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా, వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్న ఈ దూకుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌కు తిరుగులేని అధికారాన్ని ఖాయం చేస్తుందా లేక చేతులు కాల్చుకునే ప్రమాదంలో పడేస్తుందా అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి.

నాటి ‘చంద్రబాబు ఫార్ములా’ ఇక్కడ పనిచేస్తుందా?

తెలుగు నేలపై మాజీ ముఖ్యమంత్రులపై విచారణలు, అరెస్టుల వ్యవహారాలు ఎప్పుడూ ఊహించని ఫలితాలనే ఇచ్చాయి. గతంలో ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని జైలుకు పంపినప్పుడు అధికార పక్షం అంతా తమ చేతుల్లోనే ఉందనుకుంది. కానీ తెరవెనుక ప్రజల్లో రేకెత్తిన సానుభూతి సునామీగా మారి కూటమిని రికార్డు మెజారిటీతో అధికార పీఠంపై కూర్చోబెట్టింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితులతో ఇక్కడ కూడా అలాంటి వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర ఏర్పాటుకు నాయకత్వం వహించిన ఉద్యమ నేతగా కేసీఆర్‌పై ప్రజల్లో ఇప్పటికీ ఒక ప్రత్యేక భావోద్వేగం ఉంది. అసెంబ్లీలో ఆయన కాలు మోపకపోయినా, అధికార పక్షంపై నేరుగా విమర్శలు చేయకపోయినా.. ప్రభుత్వం ఆయన ఫాంహౌస్ వెనుక పడటం ప్రజల్లోకి ఎలా వెళ్తుందనేదే ఇక్కడ అసలు చిక్కుముడి. ఈ వ్యవహారంలో ఏమాత్రం తొందరపడి కేసీఆర్‌ను సిట్ విచారణలకో, కోర్టు మెట్లకో లాగితే.. అది కక్షసాధింపు చర్యగా మారి గులాబీ బాస్‌కి అనుకూలమై సింపతీ వేవ్‌ను సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదనలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

మూడేళ్ల పాలన తర్వాతే ఎందుకు ఈ అస్త్రం?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ ఆరోపణలపై దూకుడు ప్రదర్శించి ఉంటే ప్రజల్లో ఒక రకమైన ఆమోదం ఉండేది. కానీ అధికారం చేపట్టి మూడేళ్ల కాలం సమీపిస్తున్న తరుణంలో, ప్రభుత్వ హామీలు, పథకాల అమలుపై ప్రజల్లో నిలదీతలు మొదలవుతున్న వేళ.. హఠాత్తుగా ఎర్రవల్లిపై యుద్ధం ప్రకటించడం వెనుక వ్యూహం ఏమిటన్న ప్రశ్నలు అధికార పక్షానికి ఎదురవుతున్నాయి. పాలనాపరమైన సవాళ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చారా అన్న అనుమానాలను ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.

రేవంత్ రెడ్డి ముందున్న కత్తిమీద సాము

ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగానే 388 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూముల రికార్డులను పక్కా ఆధారాలతో నిరూపించి, వాటిని స్వాధీనం చేసుకుని దళితులకు పంచిపెడితే.. అది ఆయన నాయకత్వానికి తిరుగులేని ప్రజామోదాన్ని తెచ్చిపెడుతుంది. అవినీతిపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా ఆయన పేరు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

కానీ, చట్టపరమైన లొసుగులు, కోర్టు స్టేల మధ్య ఈ ప్రక్రియ నలిగిపోతే మాత్రం కాంగ్రెస్ సర్కార్‌కి ఎదురుదెబ్బ తప్పదు. ఈ అక్రమ భూ బాగోతాలను నిరూపించడంలో హస్తం పార్టీ విఫలమైతే.. అది కేవలం రాజకీయ ప్రతీకారంగానే మిగిలిపోయి, అంతిమంగా బీఆర్‌ఎస్‌ పుంజుకోవడానికి బలమైన ఆయుధంగా మారుతుంది. ఈ భూముల వ్యవహారం రేవంత్ రెడ్డికి రాజకీయంగా మరింత కలిసి వస్తుందా లేదంటే కేసీఆర్ రీ-ఎంట్రీకి బలమైన మైలేజీని అందిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.

#Telangana Politics#KCR#K Chandrashekar Rao#Revanth Reddy#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి