తెలంగాణ 17th ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. అంతకుముందు నాంపల్లిలోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను స్మరిస్తూ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తరతరాల అణచివేత, భూస్వామ్య దోపిడీపై ధిక్కార స్వరం వినిపించిన సుదీర్ఘ చరిత్ర తెలంగాణదని, సమ్మక్క-సారలమ్మల కాలం నుంచి సాయుధ పోరాటం వరకు అన్యాయాన్ని ఎదిరించడమే ఈ గడ్డ నైజమని కొనియాడారు.
1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిందని గుర్తుచేస్తూ, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన.. రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహారెడ్డి వంటి యోధుల స్ఫూర్తితోనే ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలు పరిష్కరించడం, హక్కులను కాపాడటమే తమ ప్రజా ప్రభుత్వ ముఖ్యాశయమని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి వివరిస్తూ, తెలంగాణ ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంతో పోటీపడుతోందని, రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కి చేరి దేశ సగటు కంటే 91 శాతం అధికంగా ఉందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా ఖాతాల్లో జమ చేశామని సీఏం వెల్లడించారు.
సన్న బియ్యం సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించడంతో వరి సాగు, దిగుబడిలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, గత 32 నెలల్లో వ్యవసాయానికి రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణల కోసం 'భూ భారతి' చట్టం తీసుకొచ్చి ఏఐ ఆధారిత 'భూమిత్ర' ద్వారా 5.94 లక్షల మందికి పట్టాదార్ పాస్‌బుక్‌లు జారీ చేశామన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం న్యాయపోరాటం చేస్తూనే, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని రేవంత్ రెడ్డిపేర్కొన్నారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని తెలిపిన సీఏం రేవంత్ రెడ్డి.. మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణాల ద్వారా ఆడబిడ్డలకు రూ.12,385 కోట్లు ఆదా అయ్యాయని, అలాగే గృహజ్యోతి కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు.
4.54 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించడంతో పాటు 3.42 కోట్ల మందికి సన్న బియ్యం, 15 లక్షల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. మరోవైపు 43 లక్షల మందికి పింఛన్లు అందిస్తుండగా, తాజాగా మరో 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యామని సీఏం తెలిపారు. పేదల ఆత్మగౌరవం కోసం ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేసి, హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..
సామాజిక న్యాయం అందించే దిశగా కుల సర్వే ఆధారంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపించామని, అలాగే దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఫిబ్రవరి 4ను "తెలంగాణ సోషల్ జస్టిస్ డే"గా ప్రకటిస్తున్నామని సీఎం వివరించారు. విద్య, వైద్య రంగాలను రెండు కళ్లుగా భావిస్తూ ప్రతి నియోజకవర్గంలో 20-25 ఎకరాల్లో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు' మరియు 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తున్నామన్నారు.
బడుల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని 12వ తరగతి వరకు విస్తరించడం వల్ల విద్యా ప్రదర్శన సూచీ (PGI)లో తెలంగాణ 28 నుంచి 18వ స్థానానికి మెరుగైందని తెలిపారు. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లండన్ వంటి ప్రముఖ విదేశీ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
అలాగే ఆరోగ్య రంగానికి సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి, సనత్‌నగర్‌లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రారంభించామని తెలిపారు. యువతకు పారదర్శకంగా 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' మరియు ఐటీఐలను 'అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ATC) గా మార్చడం ద్వారా విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయని సీఏం పేర్కొన్నారు.
మరోవైపు అభివృద్ధి విస్తరణలో భాగంగా రూ.38,595 కోట్లతో 122.9 కి.మీల మెట్రో రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాల భూసేకరణ పూర్తి చేశామని తెలిపారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతూనే, ఆహార కల్తీపై 'TG SAFE', మాదకద్రవ్యాల నివారణకు 'ఈగల్' వ్యవస్థను కఠినతరం చేశామన్నారు. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ ద్వారా 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చి, దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న దేశంలోనే తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీ 'భారత్ ఫ్యూచర్ సిటీ' మాస్టర్ ప్లాన్‌ను ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా ఆవిష్కరిస్తామన్నారు. ఇక్కడ టీసీఎస్ రూ.70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్, అమెజాన్ రూ. లక్ష కోట్లతో డేటా సెంటర్ నిర్మిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ఎల్‌నినో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు తాగునీరు, విద్యుత్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెబుతూ, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుకుందామని రేవంత్ పిలుపునిచ్చారు.










