Keesara ACB Trap: పోలీస్ స్టేషన్ అంటే భయం.. ఠాణా మెట్లు ఎక్కాలంటే వణుకు. అలాంటిది ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే జనం టపాసులు కాల్చారు.. స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దృశ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రక్షక భటులుగా ఉంటూ లంచాల వేటలో మునిగిపోయిన సీఐ, ఎస్సైలు ఏసీబీ వలలో చిక్కడంతో స్థానిక ప్రజలు పండుగ చేసుకున్నారు.
ఒకే దెబ్బకు రెండు రాబందులు చిక్కాయ్!
కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి అందినకాడికి దండుకుంటూ బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. లంచం తీసుకుంటూ ఉండగా ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన కీలక అధికారులే ఇలా ఒకేసారి కటకటాలపాలు కావడం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది.
పీడ విరగడైందంటూ బాణాసంచా మోత
ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో కీసర, బోగారం గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టేషన్ పరిధిలో చిన్న సమస్య వచ్చినా చేతులు తడపనిదే పనికాదని, ప్రతి కేసుకు రేటు కట్టి వేధించారని ఆగ్రహంతో ఉన్న బాధితులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. నేరుగా కీసర పోలీస్ స్టేషన్‌కి చేరుకుని బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
వ్యవస్థకు చెంపపెట్టులాంటి నిరసన
ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడితే స్టేషన్ ముందు ప్రజలు బాణాసంచా కాల్చడం అనేది ఆ అధికారులు సాగించిన దౌర్జన్యాలు, బాధితుల ఆవేదన ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తోంది. రక్షించాల్సిన చేతులే భక్షకులుగా మారితే ప్రజల స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో కీసర ఘటన రుజువు చేసింది. ప్రస్తుతం ఈ ఏసీబీ ట్రాప్, దాని తాలూకు సంబరాల వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.









