International

లేఆఫ్‌ల దెబ్బ..! 8 నెలల్లోనే 1.23 లక్షల ఉద్యోగాలు కట్

రచన: Kashi7 నిమిషాల పఠనం

గతేడాది ఏడాది మొత్తంలో 1,22,606 ఉద్యోగాల కోత.. 2026లో కేవలం 8 నెలల్లోనే ఆ సంఖ్యను దాటిన లేఆఫ్‌లు..! 289 కంపెనీలు ఏకంగా 1.23 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఉద్యోగ మార్కెట్‌లో పెరుగుతున్న అనిశ్చితికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి.

ప్ర‌పంచంలో ఉద్యోగ సంక్షోభం

8 నెలల్లోనే ల‌క్ష‌కు పైగా ఉద్యోగాలు క‌ట్

ఈ అనిశ్చితికి కార‌ణాలేంటి..?

ఉద్యోగం.. ఒకప్పుడు భవిష్యత్‌కు భరోసా. కానీ ఇప్పుడు అదే ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతోంది. తాజాగా Layoffs.fyi వెల్లడించిన గణాంకాలు ఉద్యోగ మార్కెట్‌లో పరిస్థితి ఎంత వేగంగా మారుతోందో చెబుతున్నాయి.

2025లో మొత్తం 1,22,606 ఉద్యోగాలు కోల్పోయారు. అయితే 2026లో ఆగస్టు నాటికే 1,23,300 ఉద్యోగాల కోత నమోదైంది. అంటే.. గతేడాది మొత్తంలో జరిగిన ఉద్యోగాల కోత కంటే ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లోనే ఎక్కువ ఉద్యోగాలు పోయాయి.

289 కంపెనీలు.. 1.23 లక్షల ఉద్యోగాలు

ఈ ఏడాది ఇప్పటివరకు 289 కంపెనీలు సుమారు 1.23 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు Layoffs.fyi గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక‌టుంది. ఉద్యోగాల కోత సంఖ్య పెరగడంతో పాటు.. కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్న వేగం కూడా ఆందోళన కలిగిస్తోంది.

గతేడాది మొత్తం నమోదైన లేఆఫ్‌లను.. ఈ ఏడాది ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే దాటేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం ప‌డుతోంది. అంటే.. ఇదే వేగం కొనసాగితే 2026 ముగిసే నాటికి లేఆఫ్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఏ రంగాల్లో ఎక్కువ ప్రభావం?

లేఆఫ్‌ల ప్రభావం ప్రధానంగా టెక్నాలజీ, స్టార్టప్‌లు, డిజిటల్‌ సర్వీసులు వంటి రంగాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వ్యాపార పరిస్థితులు మారడం, ఖర్చులను నియంత్రించడం, సంస్థల పునర్వ్యవస్థీకరణ వంటి కారణాలతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి.

అదే సమయంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆటోమేషన్‌ కూడా ఉద్యోగాల స్వభావాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. గతంలో ఒక పని చేయడానికి అవసరమైన ఉద్యోగుల సంఖ్య.. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో తగ్గుతోంది. ముఖ్యంగా రొటీన్‌ పనులను ఆటోమేషన్‌ చేయడం ద్వారా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే ప్రతి లేఆఫ్‌కు ఏఐనే కారణమని చెప్పడం సరైంది కాదు. వ్యాపార వృద్ధి మందగించడం, పెట్టుబడులపై ఒత్తిడి, సంస్థల పునర్వ్యవస్థీకరణ వంటి అనేక కారణాలు కలిసి ఉద్యోగాల కోతకు దారితీస్తున్నాయి.

ఉద్యోగం ఉన్నవారిలోనూ టెన్షన్‌!

లేఆఫ్‌ల ప్రభావం ఉద్యోగం కోల్పోయిన వారికే పరిమితం కావడం లేదు. కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లోనూ భవిష్యత్‌పై ఆందోళన పెరుగుతోంది. తర్వాతి లేఆఫ్‌ లిస్ట్‌లో నా పేరు ఉంటుందా? అనే భయం చాలామందిని వెంటాడుతోంది.

ముఖ్యంగా టెక్‌ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం అప్‌డేట్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఒక టెక్నాలజీలో నైపుణ్యం ఉంటే ఉద్యోగానికి సరిపోతుందనుకునేవారు. ఇప్పుడు కొత్త టూల్స్‌, ఏఐ ఆధారిత సాంకేతికతలు, మారుతున్న మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా స్కిల్స్‌ పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఏఐ త‌ర్వాత ఉద్యోగాల పరిస్థితి ఏంటి?

ఏఐ విస్తరణతో ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. కొన్ని రకాల రొటీన్‌ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అదే సమయంలో కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అయితే ఉద్యోగ మార్కెట్‌లో మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

ఒకప్పుడు ఉద్యోగం సంపాదించడం ప్రధాన సవాలైతే.. ఇప్పుడు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను నిరంతరం మార్చుకోవడం కూడా అంతే కీలకంగా మారింది.

2026లో లేఆఫ్‌ల లెక్క ఎక్కడికి?

ఇప్పటికే ఎనిమిది నెలల్లో 1,23,300 ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. 8 నెల‌ల్లోనే గతేడాది మొత్తం సంఖ్యను దాటిపోయింది. ఇంకా 2026లో నాలుగు నెలలు మిగిలే ఉన్నాయి. దీంతో ఏడాది చివరికి లేఆఫ్‌ల సంఖ్య ఎక్కడికి చేరుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

గతేడాది 1.22 లక్షలు.. ఈ ఏడాది కేవలం ఎనిమిది నెలల్లోనే 1.23 లక్షలు. ఈ రెండు నెంబ‌ర్ల మధ్య తేడా కంటే.. వాటి వెనుక ఉన్న ఉద్యోగుల భవిష్యత్‌ ముఖ్యం. కంపెనీలకు ఖర్చుల నియంత్రణ అవసరం కావచ్చు. ఏఐ, ఆటోమేషన్‌ వ్యాపారాలకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టవచ్చు. కానీ.. ప్రతి లేఆఫ్‌ వెనుక ఒక కుటుంబం, ఒక EMI, ఒక భవిష్యత్‌ ప్రణాళిక ఉంటాయి.

అందుకే ఇప్పుడు ప్రశ్న.. లేఆఫ్‌లు ఎన్ని జరిగాయన్నది మాత్రమే కాదు. మారుతున్న టెక్నాలజీ, మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో.. భవిష్యత్‌ ఉద్యోగ మార్కెట్‌ ఎలా ఉండబోతోందన్నదే.

#layoffs#job cuts#layoffs 2026#job losses#tech layoffs#global layoffs#employment crisis#job market#layoffs.fyi#123300 jobs#company layoffs#tech jobs#AI layoffs#automation#employment news#job crisis#workforce reduction#corporate layoffs#jobs crisis#2026 layoffs
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి