- ఓవైపు 22ఏ కష్టాలపై ‘జెన్ జీ’ లాంటి ఉద్యమం
- మంత్రి పదవి రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్
- ఇంకోవైపు డోస్ పెంచిన ప్రతిపక్షాలు
- గల్లీలో గులాబీ గలాట.. బీజేపీ దీక్షా సమరం
- మరోవైపు సొంత నేతల కయ్యాలతో సతమతం అవుతున్న కాంగ్రెస్
- 1,000 రోజుల మలి పాలనలో రోజురోజుకూ వేడెక్కుతున్న రాజకీయం
- కత్తికి కత్తి,గన్నుకు గన్నులా రియల్ ఎస్టేట్‌ను నమ్ముకుని రాజకీయం చేస్తున్న వాళ్లు భూములతోనే పతనం కావాల్సిందేనా?
- వర్షాకాల సమావేశాల ముందు రాష్ట్రంలో పొలిటికల్ హీట్
- అసెంబ్లీని అష్టదిగ్బంధనం చేసేందుకు ప్రభుత్వ బాధితులు రెడీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
98480070809
తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్‌కు సొంత ఇంటి గొడవలతో ఢిల్లీలో బిజీబిజీగా సీఎం మీటింగ్స్, పార్టీలో సమన్వయం, ఇతర పోస్టులతో నెలకు ఒక్కసారి ఆ వేడి గాలికే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ గ్రౌండ్ లెవల్‌లో ఉద్యమాన్ని నిర్మించి ఫైట్ చేసేందుకు అస్త్రాలను సిద్దం చేసుకుంది.ఇప్పటివరకు ప్రతి నియోజక వర్గంలో ఉన్న ప్రజలను అసెంబ్లీ ముట్టడికి పార్టీలు సిద్ధం చేస్తున్నాయి.
1,000 రోజుల పాలన.. మాటల మంటలు
కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అధికార పార్టీ తన పాలనను ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా సాగుతున్న ప్రభుత్వంగా వివరిస్తోంది. ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ నేతలు వివిధ కార్యక్రమాల్లో తమ విజయాలను ప్రస్తావిస్తున్నారు. అయితే, బీఆర్‌ఎస్ మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగుతోంది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు,ఆరు గ్యారెంటీల అమలు, వివిధ వర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ నేటి (సెప్టెంబర్ 2) నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ పనితీరుపై ఛార్జ్‌షీట్‌ను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ఇంకోవైపు, బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది.
‘వైట్ పేపర్’కు డిమాండ్
అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై సమగ్ర చర్చ జరగాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ పనితీరుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతూ తమ వద్ద ఉన్న అంశాలతో ప్రభుత్వాన్ని సభలోనే నిలదీస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కేసీఆర్ చుట్టూ మళ్లీ రాజకీయ రగడ
ఇదే సమయంలో ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలంగా లేకపోవడాన్ని కాంగ్రెస్ ప్రధాన అస్త్రంగా మలుస్తోంది. కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. నేటి(సెప్టెంబర్ 1) నుంచి 6వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునివ్వడం, 6న ఇందిరాపార్క్ వద్ద భారీ కార్యక్రమానికి సిద్ధం కావాలని సూచించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
10 ఏళ్ల పాలన వర్సెస్ 1,000 రోజుల పాలన
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ పోరుకు అసెంబ్లీ వేదిక కానున్నది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనతో కాంగ్రెస్ 1,000 రోజుల పాలనను పోల్చుతూ అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.ఈ సవాల్‌కు బీఆర్‌ఎస్ కూడా సభలోనే సమాధానం ఇవ్వడానికి సిద్ధమవుతుండటంతో రానున్న సమావేశాలు రాజకీయంగా కీలకంగా మారనున్నాయి.
బీజేపీదీ సొంత పోరుబాటే!
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోరుతో పాటు బీజేపీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతోంది. 1,000 రోజుల పాలనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తూ ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. రైతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, భూ సంబంధిత అంశాలు సహా పలు సమస్యలపై ఆందోళనలకు పార్టీ సిద్ధమవుతోంది.
ఢిల్లీలో కాంగ్రెస్ కయ్యాల కుంపటి
ఇక, రాష్ట్ర రాజకీయాలతో పాటు కాంగ్రెస్ అంతర్గత పరిణామాలు కూడా చర్చకు వస్తున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్ కూడా తన రాజకీయ పునరుద్ధరణపై దృష్టి సారిస్తోంది. ప్రజా సమస్యలను ముందుకు తెచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పాటు పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో యాక్టివ్ చేయడంపై బీఆర్‌ఎస్ దృష్టి పెడుతోంది. డిజిటల్ ప్రచారానికీ పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మరోవైపు, 22ఏ బాధితులు కూడా ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ సర్కారును నిలదీయాలని చూస్తున్నారు. ఢిల్లీలో జరిగిన జెన్ జీ పోరాటాన్ని తలపించేలా 22ఏ పై యుద్ధం చేయాలని చూస్తున్నారు. మొత్తంగా, అటు పార్టీలు, ఇటు బాధితులు ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేసేందుకు వ్యూహాలు రచించాయి.










