టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని ఆయన నివాసంలో నేటి ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నట్టు సమాచారం.. కాగా ఈ సోదాలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొత్తం ఏడు బృందాలు ఏకకాలంలో చేపట్టాయి.
లోకనాథం ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తిరుమలలో లోకనాథంకు సంబంధించిన గెస్ట్‌హౌస్‌తో పాటు.. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి నివాసంలో సైతం సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏసీబీ తనిఖీలు జరుగుతున్న సమయంలో లోకనాథం తన ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఏసీబీ అధికారులు తిరుమలలోని ఆయన కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. లోకనాథంపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా, ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, ఏసీబీ సోదాల్లో ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సోదాలు పూర్తయిన తర్వాతే ఆస్తులు, స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా లోకనాథం విధులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి 2025 అక్టోబర్ వరకు కూడా ఆయన ఈ బాధ్యతల్లోనే కొనసాగారు. అనంతరం తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి బదిలీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన బదిలీల్లో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి మళ్లీ తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా లోకనాథం నియమితులయ్యారు.
అదే సమయంలో తిరుమల డిప్యూటీ ఈవోగా ఉన్న హరీంధ్రనాథ్‌ను తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి బదిలీ చేశారు. మరోవైపు టీటీడీ అధికారిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం చాలా కాలం తర్వాత ఇదే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో టీటీడీ డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి నివాసంలో 2016లో ఏసీబీ సోదాలు జరిగాయి. అనంతరం సుమారు 15 ఏళ్ల తర్వాత టీటీడీ అధికారి నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఇక ప్రస్తుతం చేపట్టిన సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది..










