తెలంగాణ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో తమ భూములు ఇవ్వబోమని బాధితులు ముందు నుంచి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భూ బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు తెలిసింది.
ఇదిలాఉండగా, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరిట ప్రభుత్వం హిమాయత్‌సాగర్‌లోని భూములను సేకరించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే, తమ భూములు తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. డీపీఆర్ లేకుండా భూసేకరణ ఎలా చేస్తారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కె.వివేక్ రెడ్డి, కె.ప్రతీక్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పిటిషనర్ల భూములని స్వాధీన పరుచుకోవొద్దని ప్రభుత్వాన్నిఆదేశించింది.
అంతకుముందు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం అధికారులు భూ సేకరణకు వెళ్ళగా అక్కడి ప్రజలు అడ్డుకున్న విషయం తెలిసిందే.కిస్మత్ పూర్, దర్గా ఖలీజ్ ఖాన్, హిమాయత్ సాగర్ గ్రామాల్లో పలుమార్లు అధికారులు భూ సర్వే చేసేందుకు వెళ్లగా.. స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ అధికారులు భూ సేకరణ విషయంలో వెనక్కి తగ్గలేదని తెలిసింది. పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు భూ సేకరణ చేపడుతున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే భూ బాధితులు హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.కాగా, కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇదిలాఉండగా, ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు విషయంలో ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా.. సింగ్ బెంచ్ తీర్పుపై న్యాయస్థానం తాత్కాలిక స్టే విధించింది. అదేవిధంగా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ అంశంలోనూ సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను.. ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.











