ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం.. ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం సురక్షితం అనే వ్యాఖ్యలు ఆర్టీసీ బస్సుల్లో తరచుగా కనిపిస్తాయి. కానీ, ఇటీవల ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతుండటంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ వాహనంలో ప్రయాణించినా, ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి సురక్షితంగా తిరిగి వస్తాడనే నమ్మకం లేని పరిస్థితుల్లో జనం తమ బ్రతుకు బండిని లాగిస్తున్నారు.
తాజాగా హుస్నాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.. బస్సు స్టీరింగ్ విరగడంతో అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మందికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం.. ఇక స్థానికుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 2426 ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుండి కరీంనగర్ కు 54 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుంది.
అయితే ఇటీవల హుస్నాబాద్ నుండి సుందరగిరి వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పనులు చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్ హరీష్ సుందరగిరి పరిధిలోని పెసరపల్లె దాటిన తర్వాత వచ్చిన మూలమలుపు వద్ద బస్సును టర్న్ చేస్తున్న క్రమంలో స్టీరింగ్ విరినట్టు సమాచారం.. దీంతో బస్సు అదుపుతప్పి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. కాగా బస్సును అదుపు చేసేలోపే ముందు టైర్లు బావి లోపలివైపు వెళ్లగా వాహనం ఆగిపోయింది.
ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బస్సులో నుండి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులుండగా.. వీరిలో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం..
ఇక ప్రమాదం తాలూకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సును ప్రోక్లైన్ సహాయంతో బయటకు తీసి హుస్నాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్స్ కామెంట్స్ తో నిండిపోతుంది..










