గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాంసం ప్రియులకు జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 4వ తేదీన నగరవ్యాప్తంగా అన్ని మాంసం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు నగరంలోని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ షాపులతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో గుర్తింపు పొందిన పశువధశాలలు సెప్టెంబర్ 4న బంద్ పాటించాలని స్పష్టం చేశారు.
మతపరమైన పండుగలు, జాతీయ దినోత్సవాల సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మాంసం విక్రయాలు, పశువధపై ఆంక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరవ్యాప్తంగా మాంసం విక్రయాలపై నిషేధం విధించినట్టు అధికారులు తెలిపారు.. కాగా ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిచి మాంసం విక్రయాలు జరిపినా, లేదా నిబంధనలకు విరుద్ధంగా పశువధకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు.
ఈ నిషేధం అమలును పర్యవేక్షించేందుకు సంబంధిత సర్కిల్ అధికారులు, వెటర్నరీ విభాగం సిబ్బంది నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలు, వ్యక్తులపై జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా చికెన్, మటన్, బీఫ్ కొనుగోలు చేసే వారు ఈ విషయాన్ని ముందుగానే గుర్తుంచుకోవాలని అధికారులు తెలిపారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాంసం ప్రియులు సెప్టెంబర్ 4న జీహెచ్‌ఎంసీ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని నాన్ వెజ్ విషయంలో ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది..










