తెలంగాణ

Konda Surekha: నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశా, హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలీదు- మంత్రి కొండా సురేఖ

రచన: NK4 నిమిషాల పఠనం

Konda Surekha: తాను చెప్పాల్సినవన్నీ పార్టీ పెద్దలకు చెప్పేశానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఢిల్లీలో కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు.

తాను చెప్పాల్సినవన్నీ పార్టీ పెద్దలకు చెప్పేశానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఢిల్లీలో కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ కు అంతా వివరించానన్న కొండా సురేఖ.. పార్టీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది తనకు తెలియదన్నారు.

ఏఐసీసీ మెంబర్ అయిన తనకు పీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వడమే తప్పు అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధమే లేదన్నారు. తన కూతురు సుస్మిత ఇండిపెండెంట్ అని, ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం అని కొండా సురేఖ మరోసారి తేల్చి చెప్పారు. తన కూతురు రాజకీయ జీవితం తన ఇష్టమన్నారు. ఆమె వ్యాఖ్యలను ఖండించటం కానీ సమర్థించటం కానీ చేయనని చెప్పారు. తన కూతురు ఏ సందర్భంలో మాట్లాడిందో ఖర్గేకు వివరించానన్నారు.

తనకు వ్యతిరేకంగా పార్టీలోని కొంతమందితో బలవంతంగా మాట్లాడించారని కొండా సురేఖ ఆరోపించారు. అలా మాట్లాడించిన వారు ఎవరో కూడా తనకు తెలుసున్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు.

''మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్ ను కలిశాను. కేసీ వేణుగోపాల్ ను కలవలేకపోయాను. ఖర్గేకు నేను చెప్పాల్సింది చెప్పాను. నా కూతురు సుస్మిత వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదని చెప్పాను. నా కూతురికి పెళ్లి అయ్యింది. ఆమె ఇండిపెండెంట్ గా ఉంది. ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం. ఒక స్వతంత్ర మహిళ మాట్లాడొద్దని చెప్పే హక్కు నాకు లేదు. నా కూతురు సుస్మిత వ్యాఖ్యలను సమర్థించటం కానీ, ఖండించటం కానీ చేయను. నా కుమార్తె కాబట్టి నన్ను బాధ్యురాలిని చేయటం సరికాదు.

అసలు నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడమే తప్పు. నాకు వ్యతిరేకంగా పార్టీలోని కొంతమందితో బలవంతంగా మాట్లాడించారు. నాకు వ్యతిరేకంగా ఎవరూ స్వచ్చందంగా మాట్లాడలేదు. పార్టీ నేతలతో నాపై విమర్శలు ఎవరు చేయించారో నాకు తెలుసు. నాపై విమర్శలు చేయించిన వారి పేర్లు చెబితే వివాదం అవుతుంది. నాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. మంత్రిగా నా పనితీరు బాగుంది. నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నేను చేసిన తప్పేమీ లేదు. నన్ను పదవిలో కొనసాగించాలని, నా పదవికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరాను. అన్నీ పరిగణించి నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ ను కోరాను'' అని కొండా సురేఖ అన్నారు.

#Konda Surekha#Telangana Congress#Cm Revanth Reddy#Congress High Command#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి