గత కలెక్టర్ నో.. ప్రస్తుత కలెక్టర్ ఓకే?
13 ఎకరాల సర్పేఖాస్ భూమిపై రాజకీయ దుమారం
అధికార పార్టీ నేతల అండదండలతో అప్పనంగా అప్పగించే ప్రయత్నం
సర్పేఖాస్ భూమి ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకుగానే ఉంటుంది
‘NOC’ ఇచ్చే పరిధి కలెక్టర్ ది కాదు
ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా CCLA పరిధిలో ఉంటుంది.
Saidabad Land Controversy: సైదాబాద్ మండలం సైదాబాద్ గ్రామంలోని సర్వే నెంబర్ 139లోని సుమారు 13 ఎకరాల సర్పేఖాస్ భూమి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కోట్ల విలువైన ఈ భూమికి సంబంధించి గతంలో కలెక్టర్ హరిచందన NOC ఇవ్వలేదని చెబుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత కలెక్టర్ ప్రియాంక హయాంలో NOCకు మార్గం సుగమమవుతోందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.
గతంలో ‘నో’.. ఇప్పుడు ‘యెస్’ ఎలా?
గత కలెక్టర్ హరిచందన ఈ భూమికి NOC ఇవ్వడానికి నిరాకరించినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందని, ప్రస్తుత కలెక్టర్ ప్రియాంక హయాంలో NOC అంశం ముందుకు సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకే భూమి.. ఒకే రికార్డులు.. మరి నిర్ణయంలో ఇంత మార్పు ఎందుకు?
గతంలో NOC ఎందుకు తిరస్కరించారు? ఇప్పుడు ఏ నిబంధనల ప్రకారం NOC ఇవ్వాలని నిర్ణయించారు? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
‘బిల్డర్ కన్ను’ పడిందా?
సుమారు రూ.250 కోట్ల విలువ ఉంటుందని ప్రచారం జరుగుతున్న ఈ 13 ఎకరాల భూమిపై ఇష్టా బిల్డర్స్ కన్నేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భూమికి సంబంధించి అగ్రిమెంట్ కూడా జరిగిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ భూమికి సంబంధించిన వ్యవహారంలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రయోజనం చేకూరేలా పరిణామాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే కారణమా?
NOC విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకుల జోక్యం, ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి అధికారులు తలొగ్గుతున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ లేదు. సంబంధిత అధికారులు, కలెక్టర్ కార్యాలయం, ఇష్టా బిల్డర్స్ స్పందిస్తేనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అసలు ఫైల్‌లో ఏముంది?
రూ.250 కోట్ల విలువగా చెబుతున్న 13 ఎకరాల భూమి విషయంలో
గతంలో NOC ఎందుకు నిరాకరించారు?
ప్రస్తుతం NOC ఇవ్వడానికి కారణాలేమిటి?
రెవెన్యూ రికార్డుల్లో భూమి హోదా ఏమిటి?
ఇష్టా బిల్డర్స్‌తో అగ్రిమెంట్ జరిగిందా?
జరిగితే ఏ ప్రాతిపదికన జరిగింది?
NOC ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉందా?
ఈ ప్రశ్నలకు అధికారుల సమాధానాల కోసం సైదాబాద్ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
‘గతంలో నో.. ఇప్పుడు ఓకే’ వెనుక అసలు కథ ఏమిటి?
సైదాబాద్ సర్వే నెంబర్ 139లోని 13 ఎకరాల భూమి వ్యవహారంలో వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.











