ఆకస్మిక వరదలతో నేపాల్ అతలాకుతలం అయింది. ముఖ్యంగా బోటెకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన జలప్రళయం వల్ల అనేక గ్రామాలు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ రాకాసి వరదల ధాటికి ఇప్పటి వరకు సుమారు 1300లకు పైగా మృతదేహాలను వెలికి తీయగా, మరో 4,500 మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటి వరకు నేపాల్ ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన విపత్తులలో ఇది ఒకటిగా నిలిచింది.
నేపాల్ సంచలన డిమాండ్
ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ సహా అనేక అంతర్జాతీయ దేశాలు నేపాల్‍కు ఆపన్న హస్తం అందించాయి. అయితే, ఆపత్కాలంలో అండగా నిలిచిన దేశాల పట్ల కృతజ్ఞత ప్రకటించాల్సిన నేపాల్, అనూహ్యంగా ఒక కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. తమకు కావాల్సింది సాయం కాదు, క్లైమేట్ జస్టిస్ అని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తున్న అమెరికా, చైనా, భారత్ వంటి దేశాలే వాతావరణ మార్పుల వల్ల సంభవించే ప్రకృతి విపత్తులకు బాధ్యత వహించాలని వాదిస్తోంది. తమ దేశంలో జరిగిన విధ్వంసానికి ఈ మార్పులే కారణమని, అందువల్ల వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తాము కోరుతున్న భిక్ష కాదని, చట్టపరమైన పరిహారమని తేల్చిచెప్పారు.
అంతర్జాతీయ సంస్థకు అధికారిక లేఖ
నేపాల్ డిమాండ్ కేవలం మాటలకే పరిమితం కాలేదు. వరదల వల్ల జరిగిన భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డ్యామేజ్ బోర్డుకు నేపాల్ ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే, అటవీ-వ్యవసాయ శాఖ మంత్రి గీతా చౌదరి సంయుక్తంగా సంతకం చేసిన ఈ లేఖలో... దేశ ఆర్థిక పరిమితులను దాటి తాము తీవ్రంగా నష్టపోయినట్టు పేర్కొంది. కాబట్టి ఈ అంశం పై తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
భారత్ స్పందన
నేపాల్ డిమాండ్‌పై భారతదేశం తన పాత విధానాన్నే అవలంభించింది.. భారతదేశంలో తలసరి ఉద్గారాలు ప్రపంచ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయని న్యూఢిల్లీ పొల్యూషన్ బోర్డ్ స్పష్టం చేసింది. మరోవైపు భారత్ చారిత్రక ఉద్గారాలకు ప్రధాన కారణం పాశ్చాత్య దేశాలేనని, వాళ్లే ముందుగా పారిశ్రామికీకరణ చెంది గ్లోబల్ కార్బన్ బడ్జెట్‌ను ఖాళీ చేశారని మొదటి నుండి వాదిస్తోంది. కాబట్టి అభివృద్ధి చెందుతున్న, బలహీన దేశాలకు నష్టపరిహారం అందించే బాధ్యత పూర్తిగా పాశ్చాత్య దేశాలదేనని తేల్చి చెప్పింది.
నేపాల్ డిమాండ్ వల్ల నష్టాలు
ఏది ఏమైనా, నేపాల్ చేసిన ఈ అనూహ్య డిమాండ్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా నష్టపోతున్న చిన్న దేశాలకు నష్టపరిహారం చెల్లించే అంశంపై భవిష్యత్తులో గ్లోబల్ లెవెల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!.. మరోవైపు నేపాల్ డిమాండ్ ను ఏ దేశమైన అంగీకరిస్తే.. ఆయా సరిహద్దు దేశాలలో ముందు ముందు ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే నైతిక బాధ్యత వహించవలసి వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
అలాగే పెద్ద దేశాలు చిన్న దేశాలకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలనేది అంతర్జాతీయ సూత్రంగా మారితే, ముఖ్యంగా భవిష్యత్తులో భారత్‌పై మరిన్ని క్లెయిమ్‌లకు తలుపులు తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారత్ కూడా వరదలు, వేడి, కరువు, హిమాలయ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది.. కాబట్టి నేపాల్ డిమాండ్ అంతర్జాతీయంగా చర్చకు దారితీసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు..









