National

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంత ప్రజలు అలర్ట్!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది.

బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ ప్రభావంతో తూర్పు, మధ్య రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా మారి భారీ అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు లేదా తీరానికి తిరిగి చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇక తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.. వాయువ్య బంగాళాఖాతం నుంచి విస్తరించిన రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో వర్ష ప్రభావం కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగులో ఉన్న రైతులకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

చెట్ల కింద, పాతబడిన భవనాల సమీపంలో, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడకూడదని హెచ్చరించారు. వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. ప్రస్తుతం బలమైన ఈదురు గాలుల కారణంగా చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

#Meteorological Department#Weather Report#Low-pressure#Warning issued#rain Alert
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి