తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వరుసగా స్వేచ్ఛ న్యూస్ లో వెలువడుతున్న కథనాలతో.. ఈ అంశంపై ప్రభుత్వం స్పందిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు 22A భూముల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 22A జాబితాపై సమగ్ర విచారణ చేపడతామని.. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అసలు 22A జాబితాలో ఏం జరిగింది? దీని వెనుక ఎవరి పాత్ర ఉంది? త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అదేవిధంగా ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగి ఉండవచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు.
మరోవైపు 22A జాబితాలో చేర్పుల వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. భూములను నిషేధిత జాబితాలో చేర్చడం పొరపాటున జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా చేశారా? అనే అంశాన్ని విచారణలో తేలుస్తామని చెప్పారు.
యాదగిరిగుట్ట ప్రాంతంలో సుమారు 42 వేల ఎకరాలను 22A నిషేధిత జాబితాలో చేర్చిన విషయాన్ని నాలుగు నెలల క్రితమే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడి ఉండవచ్చని, విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులెవరో తేల్చి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ వ్యవహారంలో 30 శాతం కమిషన్ల ఆరోపణలు కూడా దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను కొందరు అధికారులు దుర్వినియోగం చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత తప్పు ఎవరిదో నిర్ధారించి, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు.
ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం 22A వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా 22A జాబితా కారణంగా మధ్యతరగతి, పేద ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి కొట్టిపారేశారు. వాస్తవాలను తెలుసుకోకుండా చేస్తున్న విమర్శలకు అర్థం లేదని అన్నారు..


