తెలంగాణ

22ఏ చట్టం ముసుగులో 'మహా దోపిడీ': బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆందోళన!

రచన: Mamatha puppala••7 నిమిషాల పఠనం

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కాదని, ఇది అక్షరాలా 'అర్బన్ పీపుల్స్ లూటింగ్' అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్(X) వేదికగా ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. లైసెన్స్‌డ్ లూట్‌గా మారిన ఈ వ్యవస్థ వెనుక నాలుగు దశల మహాదోపిడీ కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు.

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కాదని, ఇది అక్షరాలా 'అర్బన్ పీపుల్స్ లూటింగ్' అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్(X) వేదికగా ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. లైసెన్స్‌డ్ లూట్‌గా మారిన ఈ వ్యవస్థ వెనుక నాలుగు దశల మహాదోపిడీ కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు. దశాబ్దాల కిందట కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను, 30ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయిన పట్టా భూములను రాత్రికి రాత్రే కంప్యూటర్లలో ఒక్క క్లిక్‌తో '22A నిషేధిత జాబితా'లోకి నెట్టేస్తూ ప్రజల్లో కృత్రిమ భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థలం అమ్ముకుందామంటే పిచ్చివాళ్లలా తిరగాల్సిన దుస్థితి

పిల్లల పెళ్లిళ్లు, చదువులు, అత్యవసర వైద్య ఖర్చుల కోసం స్థలం అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తున్న సామాన్యుడి నెత్తిన ఈ నిర్ణయం పిడుగులా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో అధికార యంత్రాంగం నిలువునా దోచుకుంటూ బాధితులను స్తంభం నుంచి స్తంభానికి తిప్పుతోందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బాధితులను తహసీల్దార్ (MRO) ఆఫీస్ నుంచి కలెక్టరేట్ దాకా, సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి జిల్లా రెవెన్యూ కార్యాలయాల దాకా పిచ్చివాళ్లలా తిప్పుతున్నారని మండిపడ్డారు.

ఎంఆర్‌వో దగ్గరకు వెళ్తే కలెక్టర్‌దే అధికారమని, కలెక్టరేట్‌కు వెళ్తే ఎంఆర్‌వో గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వలేదని, తీరా రెండూ పట్టుకుని పోతే పోర్టల్ లాక్ అయిందని సాకులు చెప్తున్నారని ఎండగట్టారు.'గ్రీవెన్స్ పెట్టుకోండి.. పరిశీలిస్తున్నాం' అంటూ తిప్పుతూ ప్రజలను నిస్సహాయులను చేస్తున్నారని, పక్కా పత్రాలున్నా పైసా ముట్టనిదే ఫైలు కదలడం లేదని తెలిపారు.

పనిచేయని టోల్ ఫ్రీ నంబర్

ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788 కూడా పనిచేయడం లేదని ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. విసిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితులను ఆసరాగా చేసుకుని మూడో దశ దోపిడీకి తెరలేపారని ఎమ్మెల్సీ వివరించారు. అధికార పార్టీ బినామీలు, రియల్ ఎస్టేట్ దళారులు రంగప్రవేశం చేసి, 22ఏలో పడిన ఆస్తులను రూపాయికి పావలా వంతున కారుచౌకగా తమకు రాసివ్వాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ దళారుల చేతుల్లోకి రిజిస్ట్రేషన్ కాగానే, అప్పటివరకు తిప్పిన అదే రెవెన్యూ అధికారులు ఆ సర్వే నంబర్‌ను 22A జాబితా నుంచి క్షణాల్లో మాయం చేస్తున్నారంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.

సడలింపుల ముసుగులో ప్రభుత్వ ఆస్తులను స్వాహా

ఇక ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుని తీవ్ర ఒత్తిడి వచ్చినప్పుడు నాలుగో దశ కుట్ర అమలు చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. సడలింపుల ముసుగులో గుండుగుత్తగా ప్రభుత్వ ఆస్తులను స్వాహా చేస్తున్నారని తెలిపారు. సామాన్యుల ప్లాట్లను క్లియర్ చేసే సాకుతో, వాస్తవంగా నిషేధిత జాబితాలో ఉండాల్సిన వేల ఎకరాల విలువైన చెరువులు, కుంటలు, వక్ఫ్, దేవాదాయ, కాందిశీకుల, అటవీ, ప్రభుత్వ భూములపై కూడా గుండుగుత్తగా నిషేధం ఎత్తివేస్తూ వేల కోట్ల రూపాయల ప్రజా ఆస్తులను అధికార పార్టీ పెద్దలు, రియల్ మాఫియా మింగేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

భూముల వివరాలు ఎత్తివేయడం వెనుక పక్కా స్కెచ్

సామాన్యుడిని పీడించడానికి 22Aను ఆయుధంగా వాడుతున్నారని, అదే సామాన్యుడు తిరగబడితే ప్రభుత్వ భూములను మింగేయడానికి 22A క్లియరెన్స్‌ను బొమ్మలా మారుస్తున్నారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. భూభారతి వెబ్‌సైట్ నుంచి హైదరాబాద్ జిల్లా భూముల వివరాలను పూర్తిగా ఎత్తివేయడం వెనుక కూడా ఒక పక్కా స్కెచ్ దాగి ఉందని, ఇది ప్రభుత్వం నడిపిస్తున్న రియల్ ఎస్టేట్ రాబందుల పాలన అని ఘాటుగా విమర్శించారు. సామాన్యుడి హక్కులను కాలరాస్తూ, ప్రభుత్వ ఆస్తులను బినామీలకు దోచిపెడుతున్న ఈ దారుణమైన వ్యవస్థపై ప్రజలంతా ఏకమై నిలదీయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తన ఎక్స్ (ట్విట్టర్) సందేశంలో తీవ్రస్థాయిలో పిలుపునిచ్చారు.

#Dasoju Sravan Kumar BRS#Section 22A Land Scam Telangana#BRS MLC Dasoju Sravan Tweet#Telangana Revenue Department Controversy#Bhubharati Land Details Hyderabad#Telangana Real Estate News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి