మంచి చెడులు బోధించాల్సిన ఉపాధ్యాయులే విలువలు మర్చిపోతున్నారు.తల్లిదండ్రుల తర్వాత గురువులకే అంతటి ప్రాధాన్యం ఇవ్వాలని స్కూల్లో పాఠాలు బోధించే కొందరు గురువుల బుద్ధి గతి తప్పుతోంది. ఫలితంగా ఉపాధ్యాయ వృత్తికి వారు కళంకం తీసుకొస్తున్నారు. ఓ లెక్చరర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థినులు అతనికి గట్టిగా బుద్ధి చెప్పారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ బాలికల కాలేజీలో ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. తెలుగు ఉపాధ్యాయుడు భాస్కర్ గత కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాల నాయకులు ఇవాళ ఉదయం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
అదే సమయంలో అక్కడకు వచ్చిన ఉపాధ్యాయుడు భాస్కర్‌పై విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నేతలు దాడికి పాల్పడ్డారు. కళాశాల వద్ద ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బాధిత విద్యార్థినులు సైతం ఉపాధ్యాయుడికి గట్టిగా బుద్ది చెప్పినట్టు సమాచారం. ఇదిలాఉండగా, ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు, పోలీసులు విచారణ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడు భాస్కర్ తమను వేధిస్తున్నాడని విద్యార్థినులు పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం వల్లే విద్యార్థి సంఘాలకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందని బాధితులు పేర్కొంటున్నారు. కాగా, విద్యార్థి సంఘాల నాయకులు ఉపాధ్యాయుడిపై దాడి చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు కీచక ఉపాధ్యాయుడి మీద చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థులను పేరెంట్స్ సైతం డిమాండ్ చేస్తున్నారు.
https://x.com/TeluguScribe/status/2089614056185618499?s=20
https://x.com/pulsenewsbreak/status/2089605967075774964?s=20


