రాష్ట్రంలో కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.ఆమె మంత్రి పదవి ఉంటుందా? పోతుందా?అనే దానిపై రోజుకోవార్త వైరల్ అవుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమెకు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు మంత్రిని బలి చేయడం సరికాదని కొందరు వాదిస్తుంటే.. మంత్రి పదవి ఇచ్చిన పార్టీకి నష్టం కలుగుతుందని ఆ మాత్రం తెలీదా? కూతురి వ్యాఖ్యలను సురేఖ ఎందుకు ఖండించలేదని కొందరు ఫైర్ అవుతున్నారు.
కొండా సుస్మిత వ్యాఖ్యలను తప్పడుతూ ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్‌మీట్ నిర్వహించి తీవ్రంగా మండిపడ్డారు. అంతటితో ఆగకుండా కూతురి వ్యాఖ్యలపై నేటివరకు స్పందించని మంత్రి కొండాను పదవి నుంచి తప్పించాలని క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి మీద కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటిని మంత్రి కొండా ఖండించకపోవడంతో పార్టీ అధిష్టానం సైతం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.
అయితే, క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరైన మంత్రి కొండా.. తన కూతురు సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని,వాటితో తనకు సంబంధం లేదని కమిటీ పెద్దలకు సమాధానం ఇచ్చారు. మంత్రి వివరణపై క్రమశిక్షణా కమిటీ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దీంతో మంత్రి పదవి నుంచి కొండాను తప్పించాలని పార్టీ అధిష్టానానికి క్రమశిక్షణా కమిటీ రిపోర్టు పంపించినట్టు తెలిసింది. సీడబ్ల్యూసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇంతకాలం ఆమె మీద చర్యలు ఆలస్యం అయ్యాయని టాక్.
అయితే, మంత్రి కొండా సురేఖకు అధిష్టానం నుంచి పిలుపువచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వివాదం..సీఎం రేవంత్,పార్టీ మీద కొండా సుస్మిత వ్యాఖ్యలు,క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమెను సీడబ్ల్యూసీ వివరణ కోరనున్నట్టు సమాచారం. అయితే, నేడు సాయంత్రం లేదా రాత్రిలోపు మంత్రి కొండా పదవి ఉంటుందా? ఊడుతుందా? అనేది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్ర కేబినెట్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొండాను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి పోతే కొండా కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? బయటకు వెళ్తారా? అనే చర్చ కూడా జోరందుకుంది.
https://x.com/TeluguScribe/status/2094296078384554383?s=20
ఈ క్రమంలోనే ఆమె బీజేపీలోకి వెళ్లనుందని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు. ‘కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం. ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం వల్ల ఆమె పార్టీలోకి రావడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా,పరకాల నుంచి తన కూతురు సుస్మితకు బీజేపీ టికెట్ ఇస్తా అంటే ఆమె పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. కాగా, కొండా మురళి మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.












