తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై కూటమి భాగస్వామ్యపక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ కరువైందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. మంత్రులు తమ శాఖలపై సంపూర్ణ అధికారాలు, బాధ్యతలతో స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. క్యాబినెట్ సహచరులకు తగిన స్వేచ్ఛ నివ్వకపోతే భవిష్యత్తులో కొత్త సమస్యలు ఉత్పన్నమై ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కూనంనేని స్పందించారు. రాజకీయ క్షేత్రంలో ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై విమర్శలు చేయడం సహజమేనని, అయితే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేశారు. నాయకులు విమర్శలు చేసేటప్పుడు వ్యక్తిగత అంశాలను పక్కనబెట్టి కేవలం ప్రజా సమస్యలు, విధానపరమైన అంశాలపైనే మాట్లాడాలని ఆయన హితవు పలికారు.
రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చిన భూ సమస్యలపై కూడా కూనంనేని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల దాదాపు కోటి ఎకరాల భూములు నిషేధిత జాబితాలో (22A) చిక్కుకుపోవడంతో లక్షలాది మంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ఈ వివాదాస్పద భూముల సమస్య పరిష్కారంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
లక్షలాది మంది రైతులకు సంబంధించిన ఈ భూ వివాదాల తీవ్రతను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు వెంటనే విముక్తి కల్పించి, సమగ్రమైన పరిష్కారం చూపడంలో ప్రభుత్వం కాలయాపన చేయకుండా చర్యలు తీసుకోవాలని కూనంనేని స్పష్టం చేశారు.











