ఉమ్మడి ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలు గత మూడు దశాబ్దాలుగా కంటున్న కల ఎట్టకేలకు సాకారమైంది. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం నేలలకు సంజీవని లాంటి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. నల్లమల గిరులను చీల్చుకుంటూ నిర్మించిన సొరంగాల ద్వారా ఉరకలెత్తుతూ వస్తున్న కృష్ణా జలాలను చూసి ఆ ప్రాంత రైతాంగం సంతోషంతో ఉప్పొంగిపోయింది. దశాబ్దాల తరబడి తాము ఎదురుచూసిన సాగు, తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరబోతున్నాయన్న ఆనందం రైతుల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది.
ఈ చారిత్రక ఘట్టంలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లె ఫీడర్ కెనాల్‌లోకి స్వయంగా చంద్రబాబు అడుగుపెట్టారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలకు ఆయన భక్తిశ్రద్ధలతో నమస్కరించి, పసుపు, కుంకుమ, పట్టుచీరలను కానుకగా సమర్పించి శాస్త్రోక్తంగా జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎంకు అటవీ ప్రాంత గిరిజన మహిళలు తమదైన సంప్రదాయ నృత్యాలతో, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీశైల మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని బహూకరించి ఆశీర్వచనాలు అందించారు.
వెలిగొండ ప్రాజెక్టు భారీ సొరంగాల నుంచి ఉద్భవించిన జలధారలు ముందుగా గంటవానిపల్లె ఆక్విడెక్టును చేరుకుని, అక్కడి నుంచి అత్యంత వేగంగా నల్లమల సాగర్ రిజర్వాయర్‌లోకి పరుగులు తీశాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని సభా ప్రాంగణం నుంచి ప్రత్యక్షంగా వీక్షించిన మార్కాపురం రైతులు, స్థానిక మహిళలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ప్రాజెక్టు తొలిదశ అందుబాటులోకి రావడం వల్ల సుమారు 1.19లక్షల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందనుంది.
అంతేకాకుండా, దాదాపు 4లక్షల మందికి నిరంతరం తాగునీరు లభించనుండటంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫ్లోరైడ్ మహమ్మారికి శాశ్వత చెక్ పడినట్లయింది. ప్రజల దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికిన ఈ విశేష కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు భారీ సంఖ్యలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, డీబీవీ స్వామి, పార్ధసారధితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ నాయకుడు మాధవ్ ఈ ప్రారంభోత్సవంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎంతో భావోద్వేగంతో ట్విట్టర్ (X) వేదికగా ఓ పోస్ట్ చేశారు. 1996లో తానే శ్రీకారం చుట్టిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి జాతికి అంకితం చేసే అరుదైన అవకాశం తనకు దక్కడం ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. వెలిగొండ అంటే కేవలం నీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, అది రైతన్నకు ఇచ్చే భరోసా, ఫ్లోరైడ్ రహిత తాగునీరు, ప్రగతికి బాట అని వ్యాఖ్యానించారు. ఈ మహాయజ్ఞం కోసం తమ ఊళ్లను, భూములను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుపుతూ, 'వెలిగొండ పండుగ'కు ప్రజలంతా తరలిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.











