Asaduddin Owaisi: వందేమాతరం బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించినా, పాడకుండా అడ్డుకున్నా నేరంగా పరిగణించేలా ఈ కీలక బిల్లు తెచ్చింది కేంద్రం. కాగా ఈ బిల్లుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. వందేమాతరం బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని ఆయన ఆరోపించారు.
జాతీయ గీతం జనగణమనలో దేశం, ప్రజల ఐక్యత గురించి ఉంటుందన్నారు. వందేమాతరం మాత్రం నిర్దిష్ట పూజా విధానాన్ని, దేవతల ఆరాధనను ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడ్డారు. దేవుళ్లు, దేవతలను ఆరాధించాలని అందులో ఉందన్నారు. ఇది రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులపై దాడి చేయడమేనని మండిపడ్డారు. ముఖ్యంగా ఆర్టికల్స్ 25, 26, 29 కింద లభించే మత స్వేచ్ఛను, సాంస్కృతిక హక్కులను ఈ బిల్లు కాలరాస్తోందన్నారు.
వందేమాతరంలో ఫ్రీడమ్ ఫైటర్ల గురించి ఉండదన్నారు అసదుద్దీన్ ఒవైసీ. అది నేషనల్ సాంగ్ కాదన్నారు. నేను ముస్లింను, అల్లాను మాత్రమే ప్రార్థిస్తాను అని వ్యాఖ్యానించారు. భారత్ ను హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నారంటూ కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు ఒవైసీ.
వందేమాతరం బిల్లులో ఏముంది..
ఇప్పటివరకు జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం 'జన గణ మన'కు మాత్రమే చట్టపరమైన రక్షణ ఉంది. ఇకపై వందేమాతరం గేయానికి కూడా ఆ రక్షణ వర్తించనుంది. కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందేమాతరం గానానికి ఆటంకం కలిగించినా లేదా అవమానించినా గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. జాతీయ గీతంతో సమానంగా వందేమాతరానికి సమున్నత గౌరవం కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది.
ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్-1971లో సవరణల కోసం కేంద్రం వందేమాత్రం బిల్లును తెచ్చింది. ఆ చట్టం ప్రకారం జాతీయ చిహ్నాలను అవమానించడం నేరం. మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు చట్ట సవరణతో జాతీయ చిహ్నాల జాబితాలో వందేమాతరాన్ని చేర్చనున్నారు. ఈ గేయాన్ని పాడకుండా అడ్డుకున్నా, అవమానించినా నేరంగా భావిస్తారు. ‘జనగణమన’కు సమాన హోదాను ఈ గేయానికి కల్పించేందుకు కేంద్రం ఈ కీలక బిల్లు తెచ్చింది.












