సోషల్ మీడియాలో మోదీ కొత్త స్ట్రాటజీ
వరుసగా సెల్ఫీ వీడియోలు
పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదబోమంటూ మరో వీడియో
ప్రధాని అసలు వ్యూహమేంటి..?
ప్రధాని నరేంద్రమోదీ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అందుకే పార్లమెంట్‌లో యాంటి పేపర్ లీక్ బిల్ పాస్ చేశామని వెల్లడించారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతాయని నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు.
అసలు ఎందుకు ప్రధాని తరచూ సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తున్నారు..? ఆయన లక్ష్యమేంటి..? జెన్‌జీని ఆకట్టుకోవాలంటే అదొక్కటే మార్గమనుకుంటున్నారా..?
ఒకప్పుడు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలంటే... ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ జెండా, అధికారిక బ్యాక్‌డ్రాప్... ఇదే మనకు తెలిసిన ఫార్మాట్. కానీ ఇప్పుడు అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని, సెల్ఫీ కెమెరాతో, "ఫ్రెండ్స్..." అంటూ మాట్లాడుతున్నారు. రాత్రి వేళల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. సాధారణంగా యువత చేసే స్టైల్‌లో వీడియోలు కనిపిస్తున్నాయి. దీంతో ఒక ప్రశ్న అందరిలోనూ మొదలైంది.
మోదీ ఎందుకు ఒక్కసారిగా సెల్ఫీ వీడియోల బాట పట్టారు? ఇది కేవలం కమ్యూనికేషన్ మార్పా? లేక జెన్‌జీని ఆకట్టుకునే రాజకీయ వ్యూహమా?
మారిపోయిన పొలిటికల్ కమ్యూనికేషన్
గత పదేళ్లుగా మోదీ సోషల్ మీడియాను అత్యంత సమర్థంగా ఉపయోగించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ట్విట్టర్ (X), ఫేస్‌బుక్, యూట్యూబ్, 'మన్ కీ బాత్' వంటి వేదికల ద్వారా ప్రజలతో నిరంతరం కమ్యూనికేట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు యువత ఎక్కువ సమయం గడుపుతున్న ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్. ముఖ్యంగా రీల్స్, షార్ట్ వీడియోలే జెన్‌జీ కమ్యూనికేషన్ భాషగా మారాయి.
ఈ నేపథ్యంలో మోదీ కూడా అదే భాషలో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రసంగం కంటే సెల్ఫీ వీడియో వ్యక్తిగతంగా, దగ్గరగా అనిపించేలా ఉంటుందని కూడా వారు చెబుతున్నారు.
ఎందుకు జెన్‌జీపైనే ఫోకస్..?
భారత్‌లో తొలిసారి ఓటు వేసే యువత సంఖ్య ప్రతి ఎన్నికలో భారీగా పెరుగుతోంది. ఈ తరం టీవీ కంటే మొబైల్‌ను ఎక్కువగా చూస్తుంది. పొడవైన ప్రసంగాల కంటే 30 సెకన్ల రీల్‌ను ఎక్కువగా షేర్ చేస్తుంది.
అంటే... రాజకీయ సందేశం కూడా అదే ఫార్మాట్‌లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. జెన్‌జీతో మరింతగా కనెక్ట్ అవ్వండి, సోషల్ మీడియాలో చురుకుగా ఉండండి అని ఇటీవల బీజేపీ నాయకులకు సూచించారు ప్రధాని. వారి కంటే ముందే ఆయన రంగంలోకి దిగారు.
నీట్ పరీక్షా పేపర్ లీక్ వివాదం తర్వాత విద్యార్థుల నిరసనలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్స్, రీల్స్, షార్ట్ వీడియోల ద్వారానే ఉద్యమం విస్తరించింది.
కేంద్రాన్ని ఉద్యమాలతో కదిలించిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా సోషల్ మీడియా ద్వారానే ఎదిగిందనేది వాస్తవం. ఆ పార్టీ సోషల్ మీడియా ఫోర్స్ ఇంకా కళ్ల ముందు కనబడుతూనే ఉంది. అందుకే మోదీ సైతం అదే దారిని ఎంచుకున్నారు.
2029 ఎన్నికల దిశగా సంకేతమా..?
రాజకీయ పార్టీలు ఇప్పుడు కేవలం సభలతో గెలవలేవు. డిజిటల్ యుద్ధం కూడా అంతే కీలకమైంది. ఒకప్పుడు ట్విట్టర్‌లో ఆధిపత్యం సాధించిన బీజేపీ... ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, రీల్స్, షార్ట్ వీడియోల వైపు మరింత దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. యువ ఓటర్లను చేరుకోవడం రాబోయే ఎన్నికల్లో కీలక అంశంగా మారుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
మోదీ సెల్ఫీ వీడియోలు కేవలం కొత్త స్టైల్ మాత్రమే కాదు... మారుతున్న రాజకీయ కమ్యూనికేషన్‌కు ఒక సంకేతం కూడా. జెన్‌జీ భాషలో మాట్లాడాలని, అదే డిజిటల్ ప్రపంచం ద్వారా సందేశాన్ని చేర్చాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఈ మార్పు సూచిస్తోంది.












