Spirituality

Spirituality: కలశ ప్రతిష్ఠ వెనుక ఉన్న దైవిక రహస్యం ఇదే..!

రచన: Venu4 నిమిషాల పఠనం

పూజ సమయంలో కలశంలో దేవతా చైతన్యాన్ని ఆవాహన చేస్తారని విశ్వాసం. అందుకే నవరాత్రులు, గృహప్రవేశం, వివాహాలు, సత్యనారాయణ వ్రతం, హోమాలు, యజ్ఞాలు వంటి శుభకార్యాల్లో కలశ ప్రతిష్ఠకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.

హిందూ సనాతన సంప్రదాయంలో ప్రతి పూజకు, ప్రతి యజ్ఞానికి, ప్రతి శుభకార్యానికి ముందు కనిపించే పవిత్ర చిహ్నం కలశం. పండితులు, ఆగమ శాస్త్రాలు, పురాణాల ప్రకారం కలశం అనేది కేవలం నీటితో నింపిన పాత్ర కాదు.. అది సృష్టి తత్వానికి ప్రతీక. కలశంలో నింపిన జలం జీవానికి మూలం కాగా, దానిపై ఉంచే కొబ్బరికాయ ఐశ్వర్యానికి సంకేతంగా, మామిడి ఆకులు పంచభూతాలు, పంచప్రాణాలు, శుభశక్తిని సూచిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి.

పూజ సమయంలో కలశంలో దేవతా చైతన్యాన్ని ఆవాహన చేస్తారని విశ్వాసం. అందుకే నవరాత్రులు, గృహప్రవేశం, వివాహాలు, సత్యనారాయణ వ్రతం, హోమాలు, యజ్ఞాలు వంటి శుభకార్యాల్లో కలశ ప్రతిష్ఠకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఇక మత విశ్వాసాల ప్రకారం, శాస్త్రోక్తంగా కలశాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తే ఇంటిలో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత పెరుగుతుందని, శుభకార్యాల్లో ఎదురయ్యే ఆటంకాలు తగ్గుతాయని విశ్వసిస్తారు.

అలాగే మనసుకు ప్రశాంతత, భక్తి, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతాయని కూడా పండితులు చెబుతారు. ఇక కలశ ప్రతిష్ఠ చేసే సమయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ముందుగా పరిశుభ్రమైన, పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోవాలి. కలశాన్ని శుభ్రమైన నీటితో నింపాలి. సాధ్యమైతే తీర్థజలం లేదా గంగాజలాన్ని కలపడం శుభప్రదంగా భావిస్తారు.

అనంతరం కలశంపై ఐదు మామిడి ఆకులను అమర్చి, వాటిపై శుభ్రమైన కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయకు పసుపు, కుంకుమతో పాటు ఎర్రటి వస్త్రంతో అలంకరిస్తారు. తరువాత వేద మంత్రాలు లేదా దేవతకు సంబంధించిన మంత్రోచ్చారణలతో దేవతలను ఆవాహన చేసి పూజను ప్రారంభిస్తారు.

అలాగే కలశ ప్రతిష్ఠ యొక్క అసలు మహిమ పాత్రలో కాదు, మన హృదయంలో ఉంది. భక్తి, విశ్వాసం, పవిత్రమైన మనస్సుతో చేసే ప్రార్థనకే దైవానుగ్రహం లభిస్తుందని వారు చెబుతారు. అందుకే ప్రతి పూజలో కలశం కేవలం ఒక సంప్రదాయం కాదని, దైవాన్ని మన ఇంటికి, మన హృదయానికి ఆహ్వానించే పవిత్ర ప్రతీకగా భావించబడుతోందని పండితులు తెలియచేస్తున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..

#Spirituality#God#divine#Kalasha#Coconut
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి