రోడ్డు పక్కన కనిపించే పానీపూరీ, సమోసా బండ్ల దగ్గర జనాలు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటారు. రుచి కోసం చాలామంది తరచూ వీటిని తింటుంటారు. కానీ ఆ క్షణిక ఆనందం.. కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.
ముఖ్యంగా పానీపూరీలో ఉపయోగించే నీరు పరిశుభ్రంగా లేకపోతే అందులో బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి నీరు తాగడం వల్ల విరేచనాలు, వాంతులు, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్-ఏ వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అలాగే పానీపూరీలో వేసే ఉల్లిపాయలు, కొత్తిమీర, బంగాళాదుంపలు సరైన పరిశుభ్రత పాటించకుండా ఉంచితే సూక్ష్మక్రిములు సులభంగా పెరుగుతాయి. పైగా ఆహారాన్ని చేతులతో పదే పదే తాకడం వల్ల కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇక సమోసాల విషయానికి వస్తే.. చాలా చోట్ల ఒకే నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడుతుంటారు. ఇలా పదేపదే వేడి చేసిన నూనెలో హానికర రసాయనాలు ఏర్పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాంటి నూనెలో తయారైన ఆహారాన్ని తరచూ తింటే గుండె ఆరోగ్యం దెబ్బతినడం, చెడు కొలెస్ట్రాల్ పెరగడం, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు ఎదురావుతాయని చెబుతున్నారు.

సమోసాల్లో ఉండే అధిక నూనె, మైదా, ఉప్పు అవసరానికి మించిన కేలరీలను శరీరానికి అందిస్తాయని, ఫలితంగా బరువు పెరగడం, జీర్ణక్రియ మందగించడం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే రోడ్డు పక్కన దుమ్ము, పొగ, వాహనాల కాలుష్యం మధ్య ఉంచిన ఆహారంపై సూక్ష్మ ధూళి కణాలు, హానికర కాలుష్య పదార్థాలు చేరే అవకాశం కూడా ఉంటుందని, అందుకే ఎక్కడ తింటున్నామన్నది తప్పకుండా గమనించాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












