వైద్య చరిత్రలో ఓ వినూత్న విప్లవానికి తెరలేచింది. సాధారణంగా మెదడులోని కణితులను తొలగించాలంటే కపాలం (పుర్రె) తెరవడం తప్పనిసరి. అయితే ఎలాంటి ఓపెన్ సర్జరీ అవసరం లేకుండా, కేవలం ముక్కు మార్గం గుండానే మెదడులోని ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించే సరికొత్త విధానానికి భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్మీ సర్జన్ మేజర్ జగత్‌కుమార్ పటేల్ శ్రీకారం చుట్టారు. మరొక ఆర్మీ న్యూరో సర్జన్‌తో కలిసి ఆయన రూపొందించిన ఈ చికిత్సా విధానం ద్వారా రోగులు అత్యంత వేగంగా కోలుకోవచ్చని పెంటగాన్ వర్గాలు స్పష్టం చేశాయి.
సుమారు 15 సంవత్సరాలుగా భరించలేని తలనొప్పితో పాటు కంటిచూపు సమస్యలతో తీవ్రంగా నరకయాతన అనుభవించిన మెరైన్ స్టాఫ్ సార్జంట్ ఆండీ ఆర్చర్‌పై ఈ ప్రయోగాత్మక సర్జరీని నిర్వహించారు. బాధితుడికి ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా, మెదడులోని పిట్యూటరీ గ్రంథి సమీపంలో కంటి నరంపై ఒత్తిడి తెచ్చేలా 4.4 సెంటీమీటర్ల పెద్ద కణితి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ క్లిష్టమైన సమస్య పరిష్కారానికి అతడిని వాల్టర్ రీడ్ ఆర్మీ నేషనల్ మెడికల్ సెంటర్‌కు తరలించారు.
అక్కడ మేజర్ జగత్‌కుమార్ పటేల్, లెఫ్టినెంట్ కల్నల్ చార్లెస్ మిల్లర్‌తో కలిసి ముక్కులోని సంక్లిష్ట నాసికా మార్గాల గుండా సురక్షితమైన దారిని సిద్ధం చేశారు. సర్జరీ సమయంలో మేజర్ పటేల్ ప్రత్యేక ఎండోస్కోపిక్ కెమెరా సహాయంతో కణితిని హై-డెఫినిషన్‌లో స్పష్టంగా చూపిస్తుండగా, డాక్టర్ మిల్లర్ దాన్ని సున్నితంగా కత్తిరించి బయటకు తీశారు. కణితి సరైన స్థానంలో ఉంటే భవిష్యత్తులోనూ ఓపెన్ సర్జరీలతో పనిలేకుండా ఈ విధానాన్నే వాడొచ్చని, ఇది ఒక గొప్ప టీమ్‌వర్క్ అని పటేల్ పేర్కొన్నారు.
అత్యంత సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ పూర్తయిన కేవలం రెండు రోజులకే బాధితుడు వేగంగా కోలుకోవడం విశేషం. ముఖంపై ఎలాంటి కోత గుర్తులు లేకుండా, సర్జికల్ ఐసీయూలోనే కూర్చోగలిగే స్థాయికి చేరుకోవడంతో పాటు అతని చూపు కూడా క్రమంగా మెరుగుపడింది. తమ డిఫెన్స్ హెల్త్ ఏజెన్సీ పరిధిలోనే ఇలాంటి అధునాతన సర్జరీలు చేయగల ఏకైక బృందం తమదేనని మేజర్ జగత్‌కుమార్ పటేల్ ఎంతో గర్వంగా వెల్లడించారు.












