National

E20 పెట్రోల్.. దేశానికి వరమా..! ప్రజలకు భారమా..? ఆందోళనల వెనుక అసలు కథ ఇదే!

రచన: Kashi6 నిమిషాల పఠనం

ఇథనాల్.. పెట్రోల్ కంటే తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే ట్యాంక్ ఫుల్ చేసినా ముందులా మీ బండి దూరం వెళ్లకపోవచ్చు. ప్రభుత్వం మాత్రం ఈ తేడా చాలా స్వల్పమని చెబుతోంది. కానీ రోజూ వందల కిలోమీటర్లు తిరిగే క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

E20 పెట్రోల్‌పై గొడ‌వేంటి..?

దేశ‌వ్యాప్తంగా వాహ‌న‌దారుల్లో ఆందోళ‌న‌

మైలేజ్ త‌గ్గుతుంద‌ని భ‌య‌ప‌డుతున్న సామాన్యులు

ఢిల్లీలో భారీ ర్యాలీకి సిద్ధ‌మ‌వుతున్న ఆందోళ‌న‌కారులు

మీ బైక్‌లో పోసే పెట్రోల్.. రేపు మీ ఇంజిన్‌కే శత్రువవుతుందా? ఒకవైపు కేంద్ర ప్రభుత్వం... E20 నే భారత భవిష్యత్ ఇంధనం అంటోంది. మరోవైపు... కొన్ని చోట్ల రైతులు, వాహనదారులు, ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు రోడ్లపైకి వస్తున్నారు. E20 ని వెంటనే ఆపాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇది రైతులకు లాభం కాదు... కొత్త సమస్యలకు నాంది అంటూ నినాదాలు చేస్తున్నారు.

ఇంతకీ... ఒక పెట్రోల్ మిశ్రమం కోసం ఇంత గొడవ ఎందుకు..? E20 నిజంగా దేశాన్ని కాపాడుతుందా..? లేక ప్రజల జేబులకు, వాహనాలకు కొత్త పరీక్ష పెడుతుందా..?

పెట్రోల్‌లో కొత్త ట్విస్ట్... E20 అంటే అసలు ఏంటి..?

ఇప్పటి వరకు మనం ఎక్కువగా వాడింది సాధారణ పెట్రోల్ లేదా E10. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్నది E20. అంటే 80 శాతం పెట్రోల్... 20 శాతం ఇథనాల్. ఇథనాల్ అంటే చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటల నుంచి తయారయ్యే బయో ఫ్యూయల్. ప్రభుత్వం లెక్క ప్రకారం విదేశాల నుంచి వచ్చే ఖరీదైన చమురుపై ఆధారపడకుండా... మన దేశంలోనే ఇంధనం తయారు చేసుకోవచ్చన్నది ఆలోచన. వినడానికి బాగానే ఉంది. కానీ... ఇక్కడి నుంచే వివాదం మొదలైంది. ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్‌తో వాహ‌నాలు బాగానే ఉంటాయా అనేది తొలి సందేహం.

మా బండి పరిస్థితి ఏంటి..?

ఇదే ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న. దేశంలో ఇప్పటికీ కోట్ల సంఖ్యలో పాత బైకులు, కార్లు ఉన్నాయి. వాటిలో చాలావరకు E20 కోసం తయారు కాలేదు. అలాంటి వాహనాల్లో ఫ్యూయల్ పైపులు, రబ్బరు భాగాలు ఇంజిన్‌లోని కొన్ని కంపోనెంట్లు దీర్ఘకాలంలో ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కొత్త ఇంధనం తెస్తున్నారు స‌రే... మరి పాత వాహనాల సంగతి ఎవరు చూస్తారు? ఇదే వినియోగదారుల ప్రశ్న.

మైలేజ్ తగ్గిపోతుందా..?

ఇథనాల్.. పెట్రోల్ కంటే తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే ట్యాంక్ ఫుల్ చేసినా ముందులా మీ బండి దూరం వెళ్లకపోవచ్చు. ప్రభుత్వం మాత్రం ఈ తేడా చాలా స్వల్పమని చెబుతోంది. కానీ రోజూ వందల కిలోమీటర్లు తిరిగే క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కార్ల కోసం పంటలు పండించాలా..?

ఇదే అత్యంత పెద్ద చర్చ. ఇథనాల్ తయారీకి చెరకు, మొక్కజొన్న, వ‌రి వంటి పంటలు ఉపయోగిస్తున్నారు. ఆహారం కోసం పండే పంటలు ఇంధనం తయారీకి వెళ్తే... భవిష్యత్తులో ఆహార ధరలు పెరుగుతాయా..? అనే ప్రశ్న తలెత్తుతోంది.

నిజంగానే E20 ప్రమాదమా..?

ఈ ప్ర‌శ్న‌కు అవున‌ని అంత సులభంగా స‌మాధానం చెప్పలేం. ఎందుకంటే.. బ్రెజిల్ వంటి దేశాలు చాలా ఏళ్లుగా ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని విజయవంతంగా వాడుతున్నాయి. భారత్‌లో కూడా... కొత్తగా తయారవుతున్న చాలా కార్లు, బైకులు E20కి అనుకూలంగానే వస్తున్నాయి. సమస్య మొత్తం ఇంధనంలోనే కాదు...మార్పును ఎంత వేగంగా అమలు చేస్తున్నారు..? పాత వాహనాల కోసం ఎలాంటి ప్రణాళిక ఉంది..? అనే అంశాల్లోనూ ఉంది.

E20 పెట్రోల్‌పై రంగంలోకి మంత్రి

ఈ20 పెట్రోల్‌పై మొదలైన ఆందోళనలను ఆదిలోనే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది కేంద్రం. తెహసీన్‌ పూనావాలా నేతృత్వంలో ఏర్పాటైన టీమ్‌ భారత్‌.. ఈ20 పెట్రోల్‌ అమలును నిరసిస్తూ ఢిల్లీలో శుక్రవారం నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీమ్‌ భారత్‌ ప్రతినిధులను కేంద్ర పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి బుధవారం కలిసి చర్చలు జరిపారు. ఆందోళ‌న‌ల‌ను విర‌మించాల‌ని కోరారు. ఈ క్ర‌మంలో ఉత్కంఠ క‌లిగిస్తున్న అంశం ఒక్క‌టే. అదే.. భారత్ భవిష్యత్ ఇంధనం E20 అవుతుందా...? లేక... E20నే మరో కొత్త రాజకీయ, ఆర్థిక వివాదానికి కేంద్రబిందువవుతుందా..?

#E20 Petrol#E20 Fuel#E20 Petrol Controversy#Ethanol Blended Fuel#E20 Protest#India Fuel Policy#Ethanol Fuel India#E20 Mileage#E20 Engine Issues
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి