అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండో సారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి వివాద స్పదంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక విద్యార్థులకు అయితే వరస షాక్‌లు ఇస్తూనే ఉన్నాడు.. తాజాగా హెచ్-1బీ వీసాదారులకు, గ్రీన్‌కార్డ్ కోసం వేచి చూసేవారికి, విద్యార్థులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు..
అమెరికాలో చదువుకొని.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలనుకొనే విద్యార్థులకు లక్ష డాలర్ల ఫీజు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.95 లక్షలు.. విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు
కాగా ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం యూఎస్ విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉండి ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశల మీద నీళ్ళు చల్లినట్టు అయ్యింది. ఒకవేళ ట్రంప్ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే.. విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని స్థానిక మీడియా సంస్థ కథనం వెల్లడించింది..
ఇక ఎఫ్-1 వీసాపై ఉన్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 1నుండి 3 ఏళ్ల పాటు తమ రంగంలో అనుభవం పొందేందుకు ఓపీటీ ప్రోగ్రామ్ కు వీలు కల్పిస్తోంది. బీటెక్‌తోపాటు తత్సమాన విద్యార్హతల అండర్ గ్రాడ్యుయేషన్ భారత్‌లో పూర్తి చేసి, ఎఫ్-1 వీసా పొందినవారు స్టెమ్ కోర్సుల్లో ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్తుంటారు. వీటిలో ఏదైనా విభాగంలో పీజీ పూర్తి చేసిన తరువాత ఓపీటీకి దరఖాస్తు చేసుకొంటారు.
అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు STEM OPT ద్వారా డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. సాధారణంగా డిగ్రీ అనంతరం తొలి ఏడాది పని చేసే అవకాశం ఉండగా, STEM (Science, Technology, Engineering, Mathematics) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు మరో రెండేళ్ల పాటు అదే రంగానికి సంబంధించిన సంస్థల్లో ఉద్యోగం కొనసాగించే అవకాశం ఉంటుంది.
ఈ మూడేళ్ల వ్యవధిలోనే చాలామంది తమ కెరీర్‌ను బలోపేతం చేసుకుని, అనంతరం హెచ్-1బీ (H-1B) వీసా పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ వీసాల విషయంలో గతంలో అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన లక్ష డాలర్ల ఫీజు ప్రతిపాదనకు ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే.
విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా అమెరికా కంపెనీలు స్థానికులను ఎక్కువగా నియమించాలనే ఉద్దేశంతో ఈ ఫీజును పెంచాలని నిర్ణయించినప్పటికీ, కోర్టు ఆ ప్రతిపాదనను నిలిపివేసింది. ఈ పరిణామాల మధ్య అమెరికా యంత్రాంగం ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.












