రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తగ్గి నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఎగువప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణ ప్రాజెక్టులలోకి క్రమంగా వరద నీరువచ్చి చేరుతోంది.కర్ణాటకలో అల్మటి డ్యామ్ నుంచి నీటిని వదలడంతో కృష్ణ బేసిన్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది.దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద కొనసాగుతోంది.
మరోవైపు గోదావరి సైతం ఉప్పొంగుతోంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని కడెం,శ్రీరాంసాగర్ , ఎల్లింపల్లి ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. నిన్న సాయంత్రం జూరాల 17 గేట్లు, ఎల్లంపల్లి 15 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.మరోవైపు రాష్ట్రంలో చెరువులు, ప్రాజెక్టులు నెమ్మదిగానీటిని సంతరించుకుంటున్నాయి.
కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం వద్ద ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. ప్రాణహితకు సైతం భారీ వరద వచ్చింది. త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం 11 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. 12.210 మీటర్లకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ కానుంది. మేడిగడ్డ వద్ద భారీ వరద కొనసాగుతుండగా ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6,79,910 క్యూసెక్కులుగా ఉంది. 15 గేట్లు ఎత్తి 1,16,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 41 అడుగులకు చేరగా, 8.12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.












