బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో దర్యాప్తు ముగియడంతో ఆ నివేదికను కోర్టుకు అందజేయగా.. విచారణకు హాజరవ్వగాలని న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇవాళ ఆయన వెళ్లారు. ఉదయం కోకాపేటలోని తన నివాసం నుంచి బయలుదేరిన ఆయన నేరుగా కోర్టుకు చేరుకున్నారు. కోర్టులో ప్రాసెస్ ముగింపు అనంతరం నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు.
కోర్టుకు హాజరయ్యే క్రమంలోనే కేటీఆర్ ఫేస్‌బుక్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం నాపై కుట్రపూరితంగా బనాయించిన అక్రమ ఫార్ములా- ఈ కేసు విచారణకు హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టుకు వచ్చాను. ఇటువంటి తప్పుడు కేసులు ప్రజల తరఫున మేం చేసే పోరాటాన్ని ఆపలేవు. అంతిమంగా సత్యమే గెలుస్తుంది!’ అని రాసుకొచ్చారు.
ఇదిలాఉండగా, బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసు కేసులో అక్రమంగా ప్రభుత్వ నిధులను మళ్లించారని ఆయనపై అభియోగం ఉంది. ‘ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్ (FEO)’కు రూ.55 కోట్లు మళ్లించారనే అభియోగంపై ఏసీబీ 2024 డిసెంబర్‌లో కేసు నమోదు చేసింది. దాదాపు 15 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే తమ వాదనలు వినిపించేందుకు తన లాయర్‌తో కలిసి కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












