జలియన్‌వాలా బాగ్ దురంతానికి ప్రతీకారం తీర్చుకుని భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న అమరవీరుడు సర్దార్ ఉధమ్ సింగ్ వర్ధంతి (షహాదత్ దివస్) సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ధైర్యసాహసాలతో నిండిన ఉధమ్ సింగ్ జీవిత విశేషాలు, ఆయన చూపిన వీరత్వం మాతృభూమి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రతీ తరానికి నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని కొనియాడారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా విప్లవవీరుడు ఉధమ్ సింగ్‌కు నివాళులర్పించారు. లండన్ వేదికగా బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయి జలియన్‌వాలా బాగ్ హత్యాకాండకు ప్రతీకారం తీర్చుకున్న ఆయన సాహసం అసమానమైనదని అమిత్ షా పేర్కొన్నారు. గదర్ పార్టీ ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశ విముక్తి కోసం నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడిన ఆయన త్యాగం ప్రతీ భారతీయుడికి ఆదర్శమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేసుకున్నారు.
అదేవిధంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అమరవీరుడికి శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశ ఆత్మగౌరవాన్ని, న్యాయపోరాట పటిమను ప్రపంచ వేదికపై చాటిచెప్పిన మహనీయుడు ఉధమ్ సింగ్ అని లీడర్లు కొనియాడారు. ఆక్రోశాన్ని ఆయుధంగా మార్చుకుని, మాతృభూమి సేవలో ప్రాణాలను అర్పించిన ఆయన శౌర్యం శతాబ్దాల పాటు దేశప్రజల గుండెల్లో నిలిచిపోతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ నివాళి సందేశంలో అభిప్రాయపడ్డారు.
1899 డిసెంబర్ 26న పంజాబ్‌లో జన్మించిన ఉధమ్ సింగ్, 1919లో జరిగిన దారుణమైన జలియన్‌వాలా బాగ్ కూరత్వానికి బాధ్యుడైన మైకేల్ ఓడ్వయర్‌ను లండన్‌లో కాల్చిచంపి భారతీయుల పగ తీర్చుకున్నారు. ఈ ఘటనకు గానూ బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధించడంతో, 1940 జూలై 31న లండన్‌లోని పెంటన్‌విల్లే జైలులో ఆయన చిరునవ్వుతో తుదిశ్వాస విడిచారు. ప్రతి సంవత్సరం జూలై 31న దేశం ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ అమరవీరుల దినోత్సవంగా నివాళులర్పిస్తుంది.












