దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గాత్రంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని కె. జమునా రాణి (88) గురువారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయోభారంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో మరణించారు. ఆమె నిష్క్రమణతో చిత్రపరిశ్రమలో తీవ్ర సోకసంద్రం నెలకొంది. ఆమె భౌతికకాయానికి శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని సర్వజ్ఞనగర్, కాక్స్ టౌన్ సమీపంలో ఉన్న జీవనహళ్లి - కల్లహళ్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
1938 మే 17న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జమునా రాణి, తల్లి ద్రౌపది సంగీత నేపథ్యం వల్ల చిన్నతనంలోనే పాటల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. 1946లో ప్రముఖ నటుడు చిత్తూరు వి. నాగయ్య నిర్మించిన ‘త్యాగయ్య’ చిత్రంలో కేవలం ఏడేళ్ల ప్రాయంలోనే పాట పాడి గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు శ్రీలంకన్ భాష అయిన సింహళంలోనూ కలిపి దాదాపు 6,000కు పైగా పాటలు ఆలపించి శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
తెలుగు సినీ రంగానికి సంబంధించి ‘సరదా సరదా సిగరెట్టు’, ‘ఎంత టక్కరి వాడు నారాజు’, ‘ముక్కుమీద కోపం.. నీ ముఖానికే అందం’, ‘కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్యా’, ‘పదపదవె వయ్యారి గాలిపటమా’ వంటి విభిన్నమైన పాటలు ఆమెకు విశేష ప్రజాదరణతో పాటు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా, శ్రీలంక చిత్రసీమలోనూ ఆమె గాత్రం అత్యంత ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా 'సద సులాంగ్' అనే సింహళ చిత్రంలో గాయకుడు ఎ.ఎమ్. రాజాతో కలసి పాడిన ‘జీవన మీ గమన రంసారే’ గీతం అక్కడ ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచి, ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని అందించింది.
భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా తమిళ సంగీత రంగానికి ఆమె చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా 1998లో తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ పురస్కారంతో సత్కరించింది. ఆ తర్వాత 2002లో ప్రతిష్ఠాత్మక ‘అన్నాదురై’ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. జమునా రాణి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.












