తెలంగాణ

Telangana: తెలంగాణ బోర్డర్‌లో అక్రమ వసూళ్ల దందా?? వైరల్ వీడియో..

రచన: Venu4 నిమిషాల పఠనం

కొందరు వ్యక్తులు తమను ఎక్సైజ్ లేదా పోలీసు సిబ్బందిగా పరిచయం చేసుకుంటూ వాహనాలను ఆపి డ్రైవర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నదని ప్రచారం జరుగుతోంది. అయితే, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల్లో కొందరు సరైన యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్ లేకుండా ఉండటంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ సరిహద్దులో చెకింగ్ పేరుతో లారీ, ట్రక్ డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. కామారెడ్డి ప్రాంతానికి సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న ఓ వైరల్ వీడియో ఈ వ్యవహారంపై అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో కొందరు వ్యక్తులు తమను ఎక్సైజ్ లేదా పోలీసు సిబ్బందిగా పరిచయం చేసుకుంటూ వాహనాలను ఆపి డ్రైవర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నదని ప్రచారం జరుగుతోంది. అయితే, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల్లో కొందరు సరైన యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్ లేకుండా ఉండటంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోను చిత్రీకరించినట్లు చెబుతున్న ట్రక్ డ్రైవర్ శ్యాంలాల్ తన ఫేస్‌బుక్ పోస్టులో పలు ఆరోపణలు చేశారు. తెలంగాణలోకి ప్రవేశించిన వెంటనే ప్రభుత్వం గతంలో మూసివేసిన బోర్డర్ వద్ద ఎక్సైజ్ పేరుతో ట్రక్ డ్రైవర్ల నుంచి రూ.20 నుంచి రూ.200 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనను కూడా రూ.200 ఇవ్వాలని కోరారని, ఆ ఘటన మొత్తాన్ని మొబైల్‌లో రికార్డు చేసినట్లు తెలిపారు.

డబ్బులు అడిగిన వ్యక్తికి సరైన యూనిఫాం, నేమ్‌ప్లేట్, క్యాప్ లేకపోవడంతో పాటు అక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా ఉన్నాడని ఆయన ఆరోపించారు. తాను ప్రశ్నించడంతో ఇన్‌చార్జ్‌గా చెప్పుకున్న వ్యక్తి మొదట సాధారణ దుస్తుల్లో వచ్చి, కొద్దిసేపటి తర్వాత పూర్తి యూనిఫాంలో తిరిగి వచ్చాడని కూడా తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కొద్దిసేపు రోడ్డుపై నిరసన వ్యక్తం చేసినట్లు శ్యాంలాల్ తెలిపారు. ఇతర ట్రక్ డ్రైవర్లకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఐదు నిమిషాల తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించి, అధికారుల కోసం అక్కడే వేచి ఉన్నానని వివరించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పలువురు ట్రక్ డ్రైవర్లు కూడా అక్కడికి చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణలో చట్టం పేరుతో ఎలాంటి అక్రమ వసూళ్లు జరిగినా వాటిని అంగీకరించబోమని, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని శ్యాంలాల్ తన పోస్టులో విజ్ఞప్తి చేశారు.

#Telangana#Kamareddy#border#Drivers#money#Bribe
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి